Share News

Sweet Consumption: ఐటీ సిటీ.. స్వీట్‌కు దాసోహం!

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:58 AM

దీపావళి అంటే వెలుగుల పండుగే కాదు.. తీపి పండుగ కూడా. మిఠాయిలకు గిరాకీ అమాంతం పెరుగుతుంది....

Sweet Consumption: ఐటీ సిటీ.. స్వీట్‌కు దాసోహం!

హైదరాబాదీల్లో అత్యధికులు తీపి ప్రియులే.. నెలకు సగటున 10 సార్లకన్నా ఎక్కువే తింటున్న వైనం

రోజూ మిఠాయిలు తినేవారు 7 శాతం

4 శాతం మందే స్వీట్స్‌కు దూరం

దేశంలో ఇతర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి

లోకల్‌ సర్కిల్‌ సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): దీపావళి అంటే వెలుగుల పండుగే కాదు.. తీపి పండుగ కూడా. మిఠాయిలకు గిరాకీ అమాంతం పెరుగుతుంది. అయితే, హైదరాబాదీలు మాత్రం పండుగలతో సంబంధం లేకుండా ప్రతీ రోజూ పండుగే అన్నట్లు స్వీట్లు లాగించేస్తున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఆందోళనకర విషయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో దాదాపు నాలుగింట మూడొంతుల మంది ప్రతీ నెలలో పదిసార్లకన్నా ఎక్కువగానే స్వీట్లు తింటున్నారు. ‘లోకల్‌ సర్కిల్స్‌’ అనే సంస్థ దీపావళికి ముందు నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 303 జిల్లాల్లో 84 వేల మందికిపైగా వ్యక్తులను ప్రశ్నించి వారి అభిప్రాయాల్ని తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి 8,830 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

మన దగ్గర వినియోగం ఇలా..

ఈ సర్వే ప్రకారం హైదరాబాద్‌లో రోజువారీ స్వీట్లు తినే వారు 7ు మంది. నెలలో 15 కన్నా ఎక్కువసార్లు తింటున్నవారు 24ు మంది. 32ు మంది నెలలో 8నుంచి 15సార్లు తింటున్నారు. 14ు మంది నెలలో 3 నుంచి 7 సార్లు స్వీట్లు తీసుకుంటున్నారు. స్వీట్లు అస్సలు తినని వారు కేవలం 4ు మందే. సంప్రదాయ స్వీట్లతోపాటు ప్యా కేజ్డ్‌ స్వీట్‌ ఫుడ్స్‌ను (కేకులు, బిస్కెట్లు, ఐస్‌ క్రీములు, చాక్లె ట్లు, క్యాండీలు మొదలైనవి) సైతం హైదరాబాదీయులు బాగానే ఇష్టపడుతున్నట్లుగా సర్వేలో వెల్లడైంది. 13ు మంది ప్రతిరోజూ ఏదో ఒక ప్యాకేజ్డ్‌ స్వీట్‌ ఫుడ్స్‌ను తింటున్నారు.


ఇంట్లో అందరూ స్వీటు ప్రియులే!

సర్వేలో పాల్గొన్న వారిలో 15ు మంది తమ ఇంట్లోని ప్రతి ఒక్కరూ చక్కెర లేదా చక్కెర ఉత్పత్తులకు బాగా అలవాటయ్యారని తెలిపారు. 18ు మంది తమ కుటుంబ సభ్యులలో సగం నుంచి ముప్పావు వంతు మందికి ఈ అలవాటు ఉందని చెప్పుకొచ్చారు. 26ు మంది తమ కుటుంబంలో ఎవరికీ మిఠాయిల పట్ల ప్రత్యేకమైన ఇష్టమేమీ లేదని తెలిపారు. కాగా తీపిపై ఎంత మమకారం ఉన్నప్పటికీ, నగర ప్రజల్లో ఆరోగ్యం పట్ల కూడా అవగాహన ఉందని సర్వే వెల్లడించింది.

జాతీయ స్థాయిలోనూ ఇదే తీరు

దేశవ్యాప్తంగా ఇతర పట్టణాల్లోనూ స్వీట్ల పట్ల మక్కువ బాగా పెరిగిందని సర్వేలో తేలింది. 74ు మంది నెలకు మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సంప్రదాయ భారతీయ స్వీట్లను తింటున్నారు. వీరిలో 5ు మంది రోజూ తింటున్నారు. గత ఏడాది జరిగిన సర్వేతో పోలిస్తే ఈసారి స్వీట్ల వాడకం ఏకంగా 40ు పెరిగినట్లు తెలిసింది. 79ు మంది నెలకు మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ప్యాకేజ్డ్‌ స్వీట్‌ ఫుడ్స్‌ను తింటున్నారు.

1.jpg

అతిగా తింటే అనేక రోగాలు

మనం రోజూ తినే ఆహారంలో ప్రోటీన్ల శాతం తగ్గి.. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ప్రతీరోజూ స్వీట్స్‌ తినడమనేది ఒక వ్యసనం. తీపి తిన్న తర్వాత మన మెదడులో హ్యాపీ హార్మోన్‌ విడుదల అవుతుంది. ఒక్కసారి అలవాటైతే.. మళ్లీ మళ్లీ తినాలనిస్తుంటుంది. మద్యపానంలాగా ఇదీ ప్రమాదకరమే. తీపి ఎక్కువగా తిన డం వల్ల బరువు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది. అలాగే బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌, స్లీపింగ్‌ డిజార్డర్‌, గుండెజబ్బులు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ లాంటివి వస్తాయి. స్వీట్ల బదులు పళ్లు తినటం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది.

- డాక్టర్‌ ఎం.వీ.రావు, కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌,

యశోద ఆస్పత్రి, హైదరాబాద్‌

Updated Date - Oct 19 , 2025 | 03:58 AM