New affidavit rules: అఫిడవిట్‌పై ఏం చేద్దాం
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:10 AM
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను..
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో సీసీఎల్‌ఏ నిబంధనలపై తర్జన భర్జన
భూభారతి చట్టంలో లేని మూడు కొత్త అంశాలను నిబంధనల్లో పేర్కొన్న సీసీఎల్‌ఏ
అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుతుందంటున్న రెవెన్యూ యంత్రాంగం
అమలు చేయాలా? వద్దా?.. సందిగ్ధం
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) విధించిన నిబంధనలు ఇందుకు అవరోధంగా మారుతున్నాయి. ప్రధానంగా సాదాబైనామా దరఖాస్తుదారు.. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ నిబంధనను ఉంచాలా? తొలగించాలా? అన్న చర్చ అధికారుల్లో జరుగుతోంది. భూభారతి చట్టం సెక్షన్-6, సబ్ సెక్షన్-1 ప్రకారం సాదాబైనామాలను పరిష్కరించే అధికారాలు కల్పిస్తూ ఈ నెల 10న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్ జీవో నంబరు 106 ఇచ్చారు. అయితే భూభారతి చట్టంలో పేర్కొనని మూడు నిబంధనల్ని సీసీఎల్‌ఏ ఇందులో చేర్చారు. అందులో ఒకటి అఫిడవిట్ తీసుకురావాలనే నిబంధన కాగా, మరొకటి 12 ఏళ్లు అనుభవదారుగా ఉన్నట్లు దరఖాస్తుదారు రుజువు చేసుకోవడం. మూడోది.. క్రమబద్ధీకరణ జరిగే రోజు అమల్లో ఉన్న స్టాంప్‌డ్యూటీకి అదనంగా రూ.100 అపరాధ రుసుము చెల్లించాలనడం. అయితే ప్రస్తుతం దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేస్తున్న రెవెన్యూ అధికారుల్లో అఫిడవిట్ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సాదాబైనామాకు చట్టపరమైన రక్షణ లేదని, దానిపై ఆధారపడిన రైతులను అఫిడవిట్ తేవాలని ఒత్తిడి చేస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్‌లు కూడా తయారు చేసే ప్రమాదం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి..
సాదాబైనామా ఒప్పందాలన్నీ పాతవి అయినందున.. అమ్మకందారు మరణించినా, లేదా వారసులు ఎవరనే దానిపై వివాదాలున్నా అఫిడవిట్ సేకరించడం చాలా కష్టమవుతుందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పుడు వెళ్లి అఫిడవిట్ అడిగితే ఎవరూ అంగీకరించరని, సానుకూలత తక్కువగా ఉంటుందని రెవెన్యూ అధికారులు కూడా చెబుతున్నారు. అఫిడవిట్‌ను తప్పనిసరి చేస్తే మధ్యవర్తులు దరఖాస్తుదారుల నుంచి అదనపు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొనుగోలుదారు తాను డబ్బు చెల్లించానని చెప్పినా.. అమ్మకందారు తనకు మొత్తం డబ్బు ముట్టలేదని, ఇంకా బకాయి ఉందని, అఫిడవిట్ ఇవ్వలేనని అడ్డం తిరిగితే న్యాయపరమైన సమస్యలు కూడా సాదాబైనామా రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఫిడవిట్ తీసుకురావడం కష్టమవుతుందని అంటున్నారు. ఈ అంశంపై రెవెన్యూ యంత్రాంగంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిబంధనల నుంచి దీనిని తొలగించాలా, కొనసాగించాలా అనే దానిపై సీసీఎల్‌ఏ కార్యాలయ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
అపరాధ రుసుము తప్పనిసరి!
సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నందున.. స్టాంప్ డ్యూటీతోపాటు అపరాధ రుసుము కూడా వసూలు చేయాలని భూభారతి నిబంధనల సమయంలో న్యాయశాఖ సూచించింది. అయితే ఈ మొత్తం ఎంత ఉండాలనే చర్చ జరగడంతో ప్రభుత్వం మధ్యేమార్గంగా క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారు నుంచీ రూ.100 చొప్పున అపరాధ రుసుము వసూలు చేయాలని నిబంధనల్లో పేర్కొంది. దీంతోపాటు క్రమబద్ధీకరణ జరిగే రోజు అమల్లో ఉన్న స్టాంపు డ్యూటీ (7.5 శాతం) చెల్లించాలనే షరతు విధించింది. దరఖాస్తుదారు చలానా తీసిన తరువాతే క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇక 12 ఏళ్లపాటు అనుభవదారుగా ఉన్నట్లు నిరూపించుకోవడం దరఖాస్తుదారులకు సవాలుగా మారుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.