Telangana High Court: గురుకులాల్లో ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1500 సరిపోతాయా
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:36 AM
రాష్ట్రంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.1500 సరిపోతాయా....
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.1500 సరిపోతాయా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం మరోసారి చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. గురుకులాల్లో విద్యార్థులకు ఆహారం అందించే ముందు స్థానిక ప్రిన్సిపాల్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు రుచి చూడాలని, ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదిస్తూ.. గురుకులాలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థుల సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.1500 చొప్పున ఖర్చు చేయాలన్న నిర్ణయం 2022 నాటిదని, నిధులు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలంది. గురుకులాల విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని పేర్కొంటూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.