సాగర్ కుడి కాల్వకు సాగు నీటి విడుదల
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:40 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కుడి కాల్వ ఆయకట్టుకు ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు.
నాగార్జునసాగర్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కుడి కాల్వ ఆయకట్టుకు ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. కుడి కాలువ పరిఽధిలో 11.50లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ కృష్ణమూర్తి తెలిపారు. ఈ నెల 18వ తేదీన తాగు, సాగు నీటి అవసరాలకు 154 టీఎంసీల నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదికలు అందజేశామని ఆయన తెలిపారు. దీంతో గంటకు 500 క్యూసెక్కుల నుంచి 3000 క్యూసెక్కులు వరకు పెంచుతూ నీటిని విడుదల చేస్తామని ఎస్‌ఈ చెప్పారు. కార్యక్రమంలో డీఈ శ్రీకాంత్, ఏఈ లుభారతి, సుధా, అనిత, రమణ తదితరులు పాల్గొన్నారు.
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి, జూలై 23(ఆంధ్రజ్యోతి): మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వదర కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు దిగువనగల మూసీ ప్రాజెక్టు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 645అడుగులు(4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల ప్రాజెక్టు నీటిమట్టం రెండు రోజుల క్రితం వరకూ 641అడుగులుగా ఉంది. ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 643అడుగులు(3.92టీఎంసీలు)గా నమోదైంది. ఎగువ నుంచి 1799.06 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు 570.24క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.