Minister Uttam Kumar Reddy: పోలవరం-నల్లమల సాగర్‌ను అడ్డుకోండి
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:25 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును అడ్డుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి...
‘పాలమూరు’ మొదటి దశకు క్లియరెన్స్ ఇవ్వండి
కృష్ణా ట్రైబ్యునల్ విచారణ పూర్తయ్యేలా చూడండి
కేంద్ర జలశక్తి శాఖకు మంత్రి ఉత్తమ్ లేఖ
న్యూఢిల్లీ/హైదరాబాద్, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును అడ్డుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ సమర్పించిన ఈ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్)ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలిస్తోందని, ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లకుండా సీడబ్ల్యూసీతో పాటు ఇతర కేంద్ర సంస్థలను నియంత్రించాలని కోరారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కేంద్ర జలశక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావుకు లేఖ రాశారు. లేఖను రాష్ట్ర నీటి పారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం శ్రమశక్తి భవన్‌లో కాంతారావుతో పాటు సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్‌కు అందజేశారు. ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టునే పోలవరం-నల్లమల సాగర్‌గా పేరు మార్చి డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచిందని తెలిపారు. వరద నీటిపై ఆధారపడిన ఈ ప్రాజెక్టు ప్రణాళికపై తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు రావాలంటే కృష్ణా ట్రైబ్యునల్-2 త్వరగా అవార్డును ఖరారు చేయాలని, అందుకోసం విచారణను వేగవంతం చేసేలా ఆదేశించాలని కోరారు. ‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నికర జలాలను కేటాయించి డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ అందించాం. ఇందులో పోలవరం ప్రాజెక్టుతో దక్కిన 45 టీఎంసీలపై ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతున్నందున మిగతా 45 టీఎంసీలతో ప్రాజెక్టు తొలిదశకు అనుమతులు ఇవ్వాల’ని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఆల్మట్టి డ్యాం ఎత్తుపై సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నందున కర్ణాటక చేపట్టదలిచిన భూ సేకరణను ఆపాలని మంత్రి ఉత్తమ్ కేంద్రాన్ని కోరారు. సీడబ్ల్యూసీ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ నివృత్తి చేసినందున సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) డీపీఆర్‌కు అనుమతులు ఇప్పించాలన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, మక్తల్-నారాయణపేట-కొడంగల్, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, ముక్తేశ్వర్ (చన్ని కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, మొడికుంటవాగు, చనకా కొరాటాలో డిస్ట్రిబ్యూటరీలకు ప్రధానమంత్రి కృషి సింఛాయ్ యోజన కింద ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ముక్తేశ్వర్, చనకా కొరాటా, మొడికుంటవాగు, సీతారామ ప్రాజెక్టులకు ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్‌లు లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
15న పోలవరం-నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టులో కేసు
పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ఈ నెల 15న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. అదే జరిగితే.. తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ కేవియట్ దాఖలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.