Share News

Kaloji University: హెల్త్‌ వర్సిటీలో అక్రమార్కులు నిజమే

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:54 AM

వైద్యవిద్య పీజీ పరీక్షల్లో గోల్‌మాల్‌ జరిగి ఒక విద్యార్థికి నిబంధనలకు విరుద్ధంగా మార్కులు కలిపి పాస్‌ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది కాళోజీ యూనివర్సిటీలో....

Kaloji University: హెల్త్‌ వర్సిటీలో అక్రమార్కులు నిజమే

  • నిగ్గు తేల్చిన కమిటీ

  • ప్రాథమిక ఆధారాలతో సర్కారుకు నివేదిక

  • కలకలం రేపిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

  • విచారణకు కమిటీ వేసిన ప్రభుత్వం

  • ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు మెడికోల డిమాండ్‌

హైదరాబాద్‌, వరంగల్‌ మెడికల్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్య పీజీ పరీక్షల్లో గోల్‌మాల్‌ జరిగి ఒక విద్యార్థికి నిబంధనలకు విరుద్ధంగా మార్కులు కలిపి పాస్‌ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది కాళోజీ యూనివర్సిటీలో అక్ర‘మార్కులు’ పేరిట సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. వెంటనే ప్రాథమిక విచారణ జరిపించాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్ధును ఆదేశించింది. సర్కారు ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని వేశారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ప్రాథమిక విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజారావు, వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సంధ్య, వరంగల్‌ విజిలెన్స్‌ ఎస్పీ శ్రీనివాసరావులను కమిటీ సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కమిటీ వరంగల్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపింది. అక్రమాలు చోటు చేసుకున్న విషయం వాస్తవమేనని కమిటీ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆరోగ్య విశ్వవిద్యాలయం4న విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో దక్షిణ తెలంగాణలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాల పీజీ జనరల్‌ మెడిసిన్‌ విద్యార్థినికి హాల్‌ టికెట్‌ నంబరు లేదు. ఆ తర్వాత ఈ నెల 21న ఆమె పాస్‌ అయునట్లు వెల్లడించారు. దీనిపై కమిటీ సభ్యులు లోతుగా విచారించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.అలాగే, రీ కౌంటింగ్‌కు నమోదు చేసుకున్న 155 మంది విద్యార్థుల పత్రాలను పరిశీలించినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఒక్క ఘటనే కాకుండా ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని వైద్యవిద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఐటీ రంగంలో విశేష అనుభవం ఉన్న వారి చేత ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్ష ఫలితాలకు సంబంధించిన లాగిన్‌లను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిపించాలని మెడికోలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన పీజీ ఫలితాల్లో 205 మంది విద్యార్థులు ఫెయిలవగా, 155 మంది రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో ఏ ఒక్క అభ్యర్థి కూడా పాస్‌ కాలేదని రిజిస్ట్రార్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలో 2,123 మంది పీజీ అభ్యర్థులు అక్టోబరు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన థియరీ పరీక్షలు, 23వ తేదీ నుంచి నవంబరు 1వ తేదీ వరకు నిర్వహించిన ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. ఇందులో 1,918 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. పీజీ ఫలితాల్లో అవకతవకలు ఉన్నట్లయితే విచారణలో నిజాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 04:54 AM