Share News

Tribal Welfare Department: అడ్డగోలు బదిలీలు, పదోన్నతులు

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:49 AM

గిరిజన సంక్షేమ శాఖలో అడ్డగోలుగా బదిలీలు, పదోన్నతుల పరంపర కొనసాగుతూనే ఉంది. నిబంధనలు, మార్గదర్శకాలను లెక్కచేయకుండా తాత్కాలిక బాధ్యతల...

Tribal Welfare Department: అడ్డగోలు బదిలీలు, పదోన్నతులు

  • ముందు అదనపు బాధ్యతలు.. ఆ తర్వాత శాశ్వత పదవులు

  • గిరిజన సంక్షేమ శాఖలో ఇష్టారాజ్యం

హైదరాబాద్‌, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖలో అడ్డగోలుగా బదిలీలు, పదోన్నతుల పరంపర కొనసాగుతూనే ఉంది. నిబంధనలు, మార్గదర్శకాలను లెక్కచేయకుండా తాత్కాలిక బాధ్యతల పేరుతో ఉన్నత హోదాలో నియమించి, వెంటనే ఆ పోస్టుల్లోనే పూర్తిస్థాయిలో కొనసాగేలా డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) నుంచి ఆమోదం పొందేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీని వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. ఇదే శాఖలో పదవీ విరమణ చేసి, ప్రస్తుతం సచివాలయంలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగి చక్రం తిప్పారనే విమర్శలున్నాయి. ఆగస్టు 30న ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరికి పదోన్నతులు, బదిలీలు కల్పిస్తూ జీవో నెం.242 జారీ అయింది. ఏటూరునాగారం సబ్‌ డివిజన్‌లో డీఈఈగా ఉన్న ఎం.బాలుకు ఆరేడు నెలల క్రితమే హైదరాబాద్‌ మైదాన ప్రాంత ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జీవో ప్రకారం ఆయనకే పూర్తి అదనపు బాధ్యతలతో హైదరాబాద్‌ ఎస్‌ఈగా నియమించి.. అదే రోజున కీలకమైన రాష్ట్రస్థాయి చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ)గా కూడా బాధ్యతలు ఇచ్చారు. ఉద్యోగుల సీనియారిటీ జాబితాను రూపొందించేటప్పుడు మెరిట్‌ రోస్టర్‌ పాయింట్లు పరిగణనలోకి తీసుకోకుండా జీవో నెం.436కు తూట్లు పొడిచారనే విమర్శలొచ్చాయి. దీనిపై ప్రస్తుతం న్యాయస్థానంలో డబ్ల్యూపీ దాఖలైనా.. దానిని పట్టించుకోకుండా పదోన్నతులు కల్పించారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌ సబ్‌ డివిజన్‌లో డీఈఈగా ఉన్న ఆర్డీ ఫణికుమారికి సీఈ కార్యాలయంలో ప్లానింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ ఈఈగా బాధ్యతలు అప్పగించి.. గత నెల 30న జరిగిన బదిలీల్లో ఆమెకు వరంగల్‌ ఎస్‌ఈగా పదోన్నతి కల్పించారు. రెండేళ్ల క్షేత్రస్థాయి అనుభవం లేకున్నా.. బాలుకు సీఈ, ఫణికుమారికి ఎస్‌ఈగా బాధ్యతలు అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సబ్‌ డివిజన్‌లో డీఈఈగా పనిచేసే ఏ.హేమలత హైదరాబాద్‌ టీడబ్ల్యూలో ఎస్‌ఈగా కొనసాగుతుండగా.. ఆమెకు సీఈ ఆఫీసులో ప్లానింగ్‌ అండ్‌ మానిటరింగ్‌లో ఈఈగా డిమోషన్‌ ఇచ్చారు. బాలుకే ఎస్‌ఈ, సీఈ పోస్టులు కేటాయించడంతో ఆమెకు ఈఈ పోస్టుతో సరిపెట్టాల్సి వచ్చింది. గత నెల విడుదల చేసిన మరో జీవో నెం.258 ప్రకారం తిరిగి ఆమెకు ఎస్‌ఈగా పదోన్నతి కల్పిస్తూ.. యథాస్థానం కేటాయించారు. మైదాన ప్రాంత ఐటీడీఏలో డీఈగా పనిచేస్తున్న సత్యానందంకు ఈఈగా పదోన్నతి కల్పించి భద్రాచలం బదిలీ చేశారు. నెల తిరగకముందే ఆయనను మళ్లీ హైదరాబాద్‌కు ఈఈగా బదిలీ చేస్తూ వారం క్రితం మరో జీవో విడుదలైంది. రోస్టర్‌ మెరిట్‌ పాయింట్లను పట్టించుకోకుండా, జీవో ఆర్టీనెం.436కు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ పదోన్నతులు, బదిలీలతో అనేక మంది ఉద్యోగులు సీనియారిటీ కోల్పోయి తీవ్రంగా నష్టపోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Oct 09 , 2025 | 04:49 AM