Share News

Dr. Ravishankar : ఆయుర్వేదాన్ని అల్లోపతిని మిక్స్‌ చేయడమే ప్రిజమ్‌

ABN , Publish Date - Oct 27 , 2025 | 02:00 AM

ఆయుర్వేదాన్ని అల్లోపతితో మిళితం చేసి అందించే వైద్య ప్రక్రియే పాలీ సైంటిఫిక్‌ రీజనరేటివ్‌ ఇంటిగ్రేటివ్‌ సిస్టమ్స్‌ మెడిసన్‌...

Dr. Ravishankar : ఆయుర్వేదాన్ని అల్లోపతిని మిక్స్‌ చేయడమే ప్రిజమ్‌

  • ఐ-ప్రిజమ్‌ వ్యవస్థాపకుడు రవిశంకర్‌ వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఆయుర్వేదాన్ని అల్లోపతితో మిళితం చేసి అందించే వైద్య ప్రక్రియే పాలీ సైంటిఫిక్‌ రీజనరేటివ్‌ ఇంటిగ్రేటివ్‌ సిస్టమ్స్‌ మెడిసన్‌(ప్రిజమ్‌) అని ఐ-ప్రిజమ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రవిశంకర్‌ పొలిశెట్టి అన్నారు. వ్యాధుల పరంగా చివరి దశలో ఉన్న రోగులకు ఇలా మిళితం చేసిన ఔషధాలతో చికిత్స అందించడం ద్వారా వారిని కాపాడవచ్చని చెప్పారు. అయితే, ఈ ఔషధాలకు శాస్త్రీయ సమ్మతి అవసరమైన నేపథ్యంలో ఐఐటీ-హైదరాబాద్‌తో కలిసి కోర్సును ప్రారంభించినట్లు వివరించారు. మాదాపూర్‌లోని టీ-హబ్‌లో ఆదివారం ‘ప్రిజమ్‌’ వైద్య విధానంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్‌తో పాటు ఐఐటీ-హెచ్‌ బయోటెక్నాలజీ విభాగం డీన్‌ డాక్టర్‌ నరహరి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిశంకర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రిజమ్‌ వైద్య విధానంపై నమ్మకం రావాలంటే ఐఐటీల్లాంటి సంస్థల ధ్రువీకరణ తప్పనిసరి. మూడేళ్లుగా మేము ప్రయత్నిస్తుంటే ఐఐటీ హైదరాబాద్‌ వాళ్లు మమ్మల్ని పలు రకాలుగా పరీక్షించి, వారికి నమ్మకం ఏర్పడిన తరువాత ప్రిజమ్‌ బేసిక్‌, అడ్వాన్స్‌డ్‌ కోర్సులను రూపొందించడానికి అంగీకరించారు. బేసిక్‌ కోర్సు 4 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో ఆయుర్వేదం, అల్లోపతి, సంస్కృతం, డాటా సైన్స్‌, ఫైథాన్‌ కోడింగ్‌, బయో ఇన్ఫర్మేటిక్‌ కోడింగ్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ విధానాల్లాంటి 12 విభాగాలుంటాయి. దీనివల్ల ఇప్పుడున్న డాక్టర్లు ఇంటిగ్రేటివ్‌ డాక్టర్లుగా మారతారు. అంటే, శాస్త్రీయంగా ఆయుర్వేదం, అల్లోపతి లాంటి వైద్య పద్ధతులను మిళితం చివరి దశలో ఉన్న రోగుల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కృషి చేయగలరు’’ అని వివరించారు. ఈ కోర్సు చేయడానికి ఎంబీబీఎ్‌సతో పాటుగా లైఫ్‌ సైన్సెస్‌ గ్రాడ్యుయేట్లు, టెక్నోక్రాట్స్‌, ఆయుష్‌ డాక్టర్లు అందరూ అర్హులేనని చెప్పారు. దేశంలో ప్రస్తుతం 4కోట్ల మంది వివిధ వ్యాధుల బారిన పడి చివరిదశలో ఉన్నారని, 33వేల ప్రిజమ్‌ డాక్టర్ల అవసరం ఉందని చెప్పారు. తామిప్పుడు నేషనల్‌ ఇంటిగ్రేడెట్‌ మెడికల్‌ అసోసియేషన్‌(నిమా)తోనూ భాగస్వాములుగా మారామని చెప్పిన రవిశంకర్‌.. నిమాలోని 4.5 లక్షల మంది డాక్టర్లకు ప్రిజమ్‌ శిక్షణ అందిస్తామని తెలిపారు.

Updated Date - Oct 27 , 2025 | 02:00 AM