Rising Global Summit: పెట్టుబడులు రైజింగ్
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:33 AM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు’తో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు దూసుకెళ్లనున్నాయి. సదస్సు వేదికగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశ...
‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు’లో ఒప్పందాలకు ముందుకొస్తున్న కంపెనీలు
భారీగా పెట్టుబడులు పెట్టనున్న సింగపూర్ సంస్థ సెంబ్‌కార్ప్
దాదాపు వెయ్యి ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం
హిందుస్థాన్ యూనీలీవర్ కంపెనీ కొత్తగా ప్లాంట్ల ఏర్పాటు
పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న దేశ, విదేశీ సంస్థలు
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు’తో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు దూసుకెళ్లనున్నాయి. సదస్సు వేదికగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశ, విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఘన భవిష్యత్తును చాటేందుకు ప్రభుత్వం.. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సును నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సదస్సు వేదికగా విజన్-2047 ప్రణాళికను కూడా ప్రకటించనుంది. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్ ఆసక్తి చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా సౌర, ఇతర సాంప్రదాయేతర విద్యుత్ రంగంలో పేరుపొందిన ఈ కంపెనీ.. మురుగునీటి శుద్ధీకరణ , మౌలిక వసతుల అభివృద్ధి వంటి పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతోంది. భారత్‌లో పలు రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. తాజాగా తెలంగాణపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సెంబ్‌కార్ప్ చర్చలు ప్రారంభించింది. ఫ్యూచర్ సిటీలో వెయ్యి ఎకరాలు కేటాయిస్తే.. తమతోపాటు సింగపూర్‌కు చెందిన మరిన్ని కంపెనీలు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని ప్రతిపాదించింది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తే.. తెలంగాణ రైజింగ్ సదస్సులో ఒప్పందం కుదుర్చుకోనుంది. పెట్టుబడుల ప్రణాళిక, ఉద్యోగాల కల్పనపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశముంది. ఇక ప్రఖ్యాత హిందూస్థాన్ యూనిలీవర్ సంస్థ కూడా ఫ్యూచర్ సిటీలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
సబ్బులు, టూత్‌పేస్టులు, డిటర్జెంట్‌లు, టీ, కాఫీ సహా ఇంట్లో ఉపయోగించే చాలా రకాల ఉత్పత్తులను విక్రయించే ఈ సంస్థకు హైదరాబాద్ శివార్లలోని ఉప్పల్, కొంపల్లిలో పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలోనూ భారీ పెట్టుబడితో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సదస్సులో దీనిపై ప్రకటన చేసే అవకాశముంది. ఇవేగాక పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ రైజింగ్ సదస్సులో గిన్నిస్ రికార్డు డ్రోన్ షో
9న మూడు వేల డ్రోన్లతో ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
‘తెలంగాణ రైజింగ్.. రండి, భాగస్వాములు కండి’
అనే ఆహ్వానం కనిపించేలా అక్షరాల సమాహారం
హైదరాబాద్/కందుకూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 9న జరిగే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు’ ముగింపు కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డు నెలకొల్పేలా భారీ ‘డ్రోన్ షో’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకేసారి 3 వేల డ్రోన్లతో ఈ ప్రదర్శన చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘తెలంగాణ రైజింగ్... రండి, భాగస్వాములు కండి’ అని ఆహ్వానిస్తూ అక్షరాల సమాహారాన్ని ఆకాశంలో ఆవిష్కరించనుంది. ఇప్పటి వరకు డ్రోన్లతో ఆకాశంలో అత్యంత పొడవైన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అబుధాబి నగరం పేరిట ఉంది. 2025 కొత్త సంవత్సర వేడుకల్లో 2,131 డ్రోన్లతో ‘హ్యాపీ న్యూ ఈయర్’ అనే వాక్యాన్ని ప్రదర్శించి యూఏఈ గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు అంతకు మించిన సంఖ్యలో డ్రోన్లతో అక్షర సమాహారాన్ని ప్రదర్శించనున్నారు.
శరవేగంగా కొనసాగుతున్న ఏర్పాట్లు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం మీర్‌ఖాన్‌పేటలో జరుగుతున్న పనులను పరిశీలించారు. సదస్సుకు వచ్చే ప్రతినిధుల వాహనాల కోసం ఎనిమిది ప్రాంతాలను చదును చేశారు. సదస్సుకు ప్రముఖులు, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు రానున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సదస్సు సమయంలో పాసులు ఉన్నవారినే ఆ రహదారుల్లో అనుమతిస్తామని స్థానికులకు సమాచారం ఇస్తున్నారు.