Share News

Bharat Future City: ఫ్యూచర్‌ సిటీ అన్ని జోన్లలో పెట్టుబడులు

ABN , Publish Date - Dec 11 , 2025 | 04:50 AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతమైంది. భారత్‌ ఫ్యూచర్‌ సిటీపై...

Bharat Future City: ఫ్యూచర్‌ సిటీ అన్ని జోన్లలో పెట్టుబడులు

  • గ్లోబల్‌ సమ్మిట్‌తో పారిశ్రామికవేత్తల్లో పెరిగిన ఆసక్తి

హైదరాబాద్‌,/సిటీ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతమైంది. భారత్‌ ఫ్యూచర్‌ సిటీపై పారిశ్రామిక వేత్తలకు ఆసక్తి పెరిగింది. దాదాపు 30వేల ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో పది రంగాల్లో పెట్టుబడులు సాధించడంపై ప్రభుత్వం ఈ సదస్సులో దృష్టి సారించింది. పది రంగాలను పది జోన్లుగా విభజించింది. ఇందులోని అన్ని జోన్లలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఎడ్యుకేషన్‌ జోన్‌లో ఆఫ్‌ క్యాంపస్‌ పెట్టేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ ముందుకొచ్చింది. స్పోర్ట్స్‌ హబ్‌ పెట్టుబడులకు దుబాయ్‌ స్పోర్ట్స్‌ సిటీ ఒప్పందం కుదుర్చకుంది. ఫారెస్ట్‌ జోన్‌లో గుజరాత్‌ జామ్‌నగర్‌ తరహాలో వంతారా ఏర్పాటుకు రిలయన్స్‌ సిద్ధమైంది. మెడికల్‌ టూరిజం విభాగంలో అపోలో హాస్పిటల్స్‌, ఆతిథ్య రంగంలో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి నోవాటెల్‌, ఫర్నిచర్‌ పార్క్‌ జోన్‌లో మలేషియన్‌ కంపెనీ జేవీ భారత కంపెనీ బాంటియాతో కలిసి పెట్టుబడులు పెట్టనుంది. 100 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీ, మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌లో సెంబ్‌కార్ప్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌, టౌన్‌షి్‌పలో ట్రంప్‌ గ్రూప్‌, రిక్రియేషన్‌ జోన్‌లో ఫిల్మ్‌ స్టూడియో నిర్మాణానికి సల్మాన్‌ ఖాన్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

రియల్‌ ఎస్టేట్‌కు కొత్త ఊపు

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ హైదరాబాద్‌ మహా నగరానికి దక్షిణ దిశలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా కొత్త ఊపు తెచ్చింది. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వెంచర్లు వేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్‌ సమీపంలో, మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు ప్రాంతంలో, శ్రీశైలం హైవేతో పాటు నాగార్జునసాగర్‌ మార్గంలో ఇప్పటికే వేసిన లేఅవుట్లలో సైట్‌ విజిట్‌లు జోరందుకున్నాయి.

Updated Date - Dec 11 , 2025 | 04:50 AM