iBomma Case: పక్కకు పోయిన పైరసీ బొమ్మ
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:11 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు రవిని ఐదు రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు..
బెట్టింగ్, మనీల్యాండరింగ్‌పైనే ప్రశ్నలు
కొలిక్కిరాని ‘ఐ బొమ్మ’ రవి కేసు.. నేడు సాయంత్రానికి చంచల్‌గూడ జైలుకు రవి
మరోసారి కస్టడీ కోరే అవకాశం
హైదరాబాద్ సిటీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు రవిని ఐదు రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు.. నాలుగు రోజులుగా పలు కోణాల్లో విచారిస్తున్నారు. సోమవారంతో కస్టడీ పూర్తవుతుంది. నాలుగు రోజుల విచారణ ముగిసినప్పటికీ.. రవి నుంచి వివరాలు రాబట్టడంలో పోలీసులు ఎలాంటి పురోగతీ సాధించలేదని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నా అతడు సహకరించట్లేదని.. ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’ అనే చెబుతున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. మొదట్లో అతడు ఓటీటీల్లో విడుదలైన సినిమాలను వేరేవారి (థర్డ్‌పార్టీ) నుంచి కొనుగోలు చేసి తన వెబ్‌సైట్లలో పెట్టి ప్రజలకు ఉచితంగా అందించినట్టు.. తర్వాతి కాలంలో ఓటీటీలోకి రాక ముందే కొత్త సినిమాలను ఐబొమ్మలో పెట్టేవాడని పోలీసులు గుర్తించారు. అదెలా సాధ్యమైంది అని పోలీసులు ఎంతగా ప్రశ్నించినా రవి ఎలాంటి వివరాలూ వెల్లడించలేదని తెలిసింది. తొలుత ఐబొమ్మ రవికి సినిమాలు విక్రయించిన ఆ థర్డ్‌పార్టీ వ్యక్తులు ఎవరు అనే దానిపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. అలాగే.. ఐబొమ్మ మాటున రవి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్, రవి ఖాతాల ద్వారా జరిగిన రూ.కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలపైనే పోలీసులు ఎక్కువగా దృష్టిసారించినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన సమాచారం పూర్తిగా సాంకేతికపరమైనది కావడంతో పోలీసులు రవి ఖాతాలున్న 35 బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు. వాటి నుంచి పూర్తి సమాచారం వస్తే తప్ప.. కేసులో పురోగతి సాఽధించలేమని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. ఐబొమ్మ రవిని అరెస్టు చేసినా సినిమా పైరసీ మాత్రం ఆగడంలేదు. రెండు రోజుల క్రితం విడులైన సినిమాలు సైతం పైరసీకి గురై వివిధ వెబ్‌సైట్లలో ప్రత్యక్షం అవడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. న్యాయస్థానం రవికి అనుమతించిన పోలీస్ కస్టడీ సోమవారం ముగియనున్న నేపథ్యంలో సాయంత్రం అతడికి వైద్యపరీక్షలు నిర్వహించి, న్యాయస్థానంలో హాజరుపరచి చంచల్‌గూడ పీఎస్‌కు తరలిస్తారు. అయితే విచారణ కొలి క్కి రావాలంటే నిందితుణ్ని మరోసారి కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.