Family Rivalries and Eka Griva in Panchayat Elections: విత్‌డ్రా చేసుకోండిలేదంటే తీవ్ర పరిణామాలుంటాయ్
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:30 AM
నామినేషన్ ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రన్‌వెల్లి సర్పంచ్‌గా నామినేషన్ వేసిన మహిళా.....
సర్పంచ్ అభ్యర్థిని బెదిరిస్తూ దళం పేరుతో లేఖ!
ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
నామినేషన్ ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రన్‌వెల్లి సర్పంచ్‌గా నామినేషన్ వేసిన మహిళా అభ్యర్థి జాడి దర్శనకు దళం పేరుతో ఉత్తరం రావడం తీవ్ర కలకలంరేపింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దతుతో జాడి దర్శన ఇదివరకే నామినేషన్ వేశారు. దర్శన మామ బాబు పశువులు మేపేందుకు ప్రాణహిత కాలువ వద్దకు వెళ్లారు. గురువారం సాయంత్రం బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి, బాబు తలకు తుపాకీ గురిపెట్టి.. ‘‘ఇది నీ కొడుక్కి (దర్శన భర్త రంజిత్) ఇవ్వు’’ అంటూ తాను ఇచ్చిన ఉత్తరాన్ని అతడి చేతుల్లో పెట్టాడు. ఈ విషయాన్ని బాబు తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు కౌటాల సీఐ సంతో్‌సకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం పోలీసులు గ్రామంలో కవాతు నిర్వహించారు. ఎలాంటి భయాందోళనలకు గురవ్వొద్దని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని అభ్యర్థి కుటుంబానికి పోలీసులు భరోసా ఇచ్చారు. కాగా ఎన్నికల్లో పోటీ చేసేవారు నామినేషన్ వేసేలోపే రూ.2లక్షలు ఖర్చుచేశారని.. ఓటును నోటుతో కొనుగోలు చేయాలనుకుంటున్నారని, అందుకే.. నా మినేషన్ ఉపసంహరించుకోవాలని తాము హెచ్చరిస్తున్నామని, దీనిపై పోలీసులను సంప్రదిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఆ లేఖలో ఉంది. కాగా గద్వాల రూరల్ ఈడిగోనిపల్లిలో సర్పంచ్ పదవి కోసం వేలంపాట ఒకరు పాడగా, నాటకీయ పరిణామాల మధ్య మరొకరు సర్పంచ్ అయ్యారు. ఆ గ్రామాన్ని బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. సర్పంచ్ పదవిని వేలంపాట ద్వారా ఏకగ్రీవం చేద్దామని, వచ్చి డబ్బుతో హనుమాన్ ఆలయానికి బాటను కొనుగోలు చేద్దామని పెద్దలు నిర్ణయించారు. వేలంపాటలో నలుగురు పోటీపడ్డారు. తన భార్య సరస్వతిని సర్పంచ్‌గా ఎన్నుకొంటే రూ.9.8 లక్షలు ఇస్తానంటూ రాఘవేంద్ర అనే వ్యక్తి వేలంపాట పాడి నె గ్గారు. అయితే ఉప సర్పంచ్‌గా తనకు నచ్చిన మెం బర్‌ను ఎన్నుకుంటానని ఆయన షరతుపెట్టారు. దీనికి రమేశ్ అనే వ్యక్తి అడ్డుచెప్పారు. పెద్దలు మాత్రం రాఘవేంద్రకే మద్దతు పలికి అడ్వాన్సుగా రూ.లక్ష తీసుకున్నారు. మర్నాడు రాఘవేంద్ర భార్య సరస్వతి నామినేషన్ వేయాల్సి ఉంది. అయితే అంతకుముందే తనభార్య రాణితో రమేశ్ నామినేషన్ వే యించారు. దీనిపై అభ్యంతరం చెప్పిన రాఘవేంద్ర విషయం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ‘వేలంపాట డబ్బులు ఎవరు ఇస్తే ఏముంది? ఇచ్చిన అడ్వా న్సు కు రెండింతల డబ్బు తీసుకో, లేదంటే నామినేషన్ వేసుకో’ అంటూ వారు రాఘవేంద్రకు చెప్పారు. రాఘవేంద్ర, పెద్దల మాటను గౌరవించి వేలంపాట పాడినా నామినేషన్ వేయలేదు. రమేశ్ భార్య రాణి మాత్రమే నామినేషన్ వేయడంతో ఆమెకే సర్పంచ్ పదవి దక్కింది. అలాగే 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఏకగ్రీవమైన సర్పంచ్ తాను డబ్బులు ఇస్తానని చెప్పలేదని, ఆంజనేయ స్వామి ఆలయానికి బాటను కొని ఇవ్వలేనని చేతులెత్తేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
పోటీలో తల్లి.. పోస్టర్లలో కొడుకు
నిజామాబాద్ జిల్లా పోతంగల్ ఫారం గ్రామంలో తల్లి రజియా బేగం నామినేషన్ వేయగా, ఆమె కుమారుడు ఫిరోజ్.. వాల్‌పోస్టర్లలో తన పేరు, ఫొటో ముద్రించుకొని గ్రామాల్లో అంటించడం కలకలం రేగింది. దీన్ని ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద పరిగణించి ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు మండలాధికారులు వెల్లడించారు. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్లలో ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థి బాణోత్ బద్రి నామినేషన్ వేసేందుకు ఊర్లో జోలె పట్టారు. వచ్చిన డబ్బుతో నామినేషన్ వేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేటలో భార్య యాస్మిన్ సర్పంచ్ అభ్యర్థిగా నామిషన్ వేయగా, భర్త మహ్మద్ బాబా మెంబర్‌గా నామినేషన్ వేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్‌ఠాణాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి(50) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డకు చెందిన లావుడ్య రవి అనే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. తాను ఇప్పటిదాకా సంపాదించుకున్నది చాలని, సమాజంలో మరింత గుర్తింపు పొందాలంటే రాజకీయంగా ఎదగాలన్నది తన కోరిక అని రవి చెప్పారు. కాగా, చివరి విడత ఈనెల 17న జరి గే పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో 11 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 25వేలు.. గృహప్రవేశానికి 10వేలు
ఇవి.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్న కొండపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన హామీలు! ఇవే కాదు.. మొత్తంగా 12 హామీలను ఆయన గ్రామస్థులకు ఇచ్చారు. వీటిని బాండ్ పేపర్‌పై ముద్రించి విడుదల చేశారు. ఆ హామీల్లో ఆడబిడ్డ ప్రసవానికి రూ.10,116, వ్యవసాయ కార్మికులకు సొంతడబ్బుతో ప్రమాద బీమా, అత్యవసరవైద్య చికిత్స కోసం రూ.5వేల నుంచి రూ.10వేల సాయం వంటి హామీలు ఆ పత్రంలో ఉన్నాయి. శుక్రవారం ఆయన నామినేషన్ వేశారు.
పొంగులేటి స్వగ్రామంలో ఎన్నిక ఏకగ్రీవం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ మద్దతుతో గొల్లమందల వెంకటేశ్వర్లు ఒక్కరే నామినేషన్ వేయటంతో ఆయనే సర్పంచ్ కానున్నారు. గ్రామ ప్రముఖులైన పొంగులేటి ప్రసాదరెడ్డి, పొంగులేటి మహేందర్‌రెడ్డి సమక్షంలో గ్రామస్థులు సమావేశమై సర్పంచ్ ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. గ్రామ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సర్పంచ్ అభ్యర్థిగా వెంకటేశ్వర్లు ఒక్కడితో నామినేషన్ వేయించడంతో పాటు పది వార్డులకు కూడా ఒక్కో అభ్యర్థితోనే నామినేషన్లు వేయించడంతో అవి కూడా ఏకగ్రీవమయ్యాయి. ఈ గ్రామ పంచాయతీని ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేశారు.