Share News

Piracy Gang Arrested: సినిమా దొంగలు దొరికారు!

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:33 AM

డిజిటల్‌ మీడియాను హ్యాక్‌ చేసి.. థియేటర్లలో రికార్డ్‌ చేసి.. పైరేటెడ్‌ సినిమాలను వివిధ వెబ్‌సైట్ల ద్వారా పంపిణీ చేసి చిత్రపరిశ్రమకు రూ.వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న అతిపెద్ద అంతర్రాష్ట్ర ముఠాను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు......

Piracy Gang Arrested: సినిమా దొంగలు దొరికారు!

  • అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఐదుగురి అరెస్ట్‌

  • 5ఏళ్లలో 500 చిత్రాల పైరసీ

  • సినీ పరిశ్రమకు రూ.22,400 కోట్ల నష్టం

  • 2024లోనే టాలీవుడ్‌కు రూ.3700 కోట్ల నష్టం

  • సినీ ప్రముఖులతో సీపీ సీవీ ఆనంద్‌ సమీక్ష

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ మీడియాను హ్యాక్‌ చేసి.. థియేటర్లలో రికార్డ్‌ చేసి.. పైరేటెడ్‌ సినిమాలను వివిధ వెబ్‌సైట్ల ద్వారా పంపిణీ చేసి చిత్రపరిశ్రమకు రూ.వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న అతిపెద్ద అంతర్రాష్ట్ర ముఠాను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని.. బిహార్‌, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి సీపీయూ, ట్యాబ్స్‌, హార్డ్‌ డిస్క్‌లు, స్మార్ట్‌ఫోన్లు, వెబ్‌కామ్‌, మెమొరీ కార్డులు, మొబైల్స్‌, ల్యాప్‌టా్‌పలు, డాంగెల్స్‌, పెన్‌డ్రైవ్‌లు తదితర ఎలకా్ట్రనిక్‌ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈ కేసు వివరాలను వెల్లడించారు. బిహార్‌కు చెందిన అశ్వనికుమార్‌, అర్సలాన్‌ అహ్మద్‌, తమిళనాడుకు చెందిన సిరిల్‌ ఇన్సంట్‌రాజ్‌, సుధాకరణ్‌, ఏపీలోని అమలాపురానికి చెందిన కిరణ్‌కుమార్‌ ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో కిరణ్‌కుమార్‌ తెలుగు సినిమాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి పంపేవాడని.. హిట్‌, సింగిల్‌, కుబేర, హరిహర వీరమల్లు వంటి సినిమాలను వీరు పైరసీ చేశారని సీపీ తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే 100 సినిమాల దాకా రికార్డ్‌ చేసినట్టు చెప్పారు. అత్తాపూర్‌లోని మంత్ర మాల్‌, సినీపోలీస్‌ థియేటర్లలో ఎక్కువగా పైరసీ చేసేవారని తెలిపారు. 2020 నుంచి వీరు దేశవాప్తంగా వివిధ భాషలకు చెందిన సుమారు 500 చిత్రాలను పైరసీ చేసి, లక్ష డాలర్ల వరకు (రూ.90లక్షలు) సంపాదించారని పేర్కొన్నారు. వీరి వల్ల దేశంలోని వివిధ చిత్రపరిశ్రమలకు రూ.22,400 కోట్లు.. ఒక్క టాలీవుడ్‌కే 2024లో రూ.3,700 కోట్లు నష్టం వాటిల్లినట్లు తేలిందని వెల్లడించారు. ఈ ఐదుగురు నిందితులకూ సహకరించిన మరో ఐదుగురికి నోటీసులు జారీ చేశామన్నారు.


టీఎ్‌ఫసీసీ ఫిర్యాదుతో..

ఈ ఏడాది మే-9న విడుదలైన ‘సింగిల్‌’ సినిమా పైరసీకి గురైందంటూ.. జూన్‌ 5న తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిఽధి యర్ర యునీంద్రబాబు సిటీ సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ముఠా సభ్యులు తమ జేబులో, పాప్‌కార్న్‌ డబ్బాల్లో అత్యాధునిక సెల్‌ఫోన్లను పెట్టి సినిమాలను రికార్డ్‌ చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. సాధారణంగా వీడియో తీసేటప్పుడు సెల్‌ఫోన్‌ స్ర్కీన్‌ ఆన్‌లో ఉంటుంది. అలా ఉండకుండా ప్రత్యేక యాప్‌ వాడేవారని పోలీసులు తెలిపారు. అలా రికార్డు చేసిన పైరసీ సినిమాల్లో బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌ల వాణిజ్య ప్రకటనలు ఉంచి వెబ్‌సైట్లు, టెలిగ్రామ్‌ చానళ్లలో పెట్టేవారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌ దేశాల ఐపీ అడ్ర్‌సలతో కూడిన సర్వర్లను ఇందుకు వాడేవారు. వాటిని సిరిల్‌ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇక.. ముఠాలోని కీలకసభ్యుడు.. బిహార్‌కు చెందిన అశ్వనీకుమార్‌ హ్యాకింగ్‌ నిపుణుడు. అతడు నేరుగా స్టూడియోల్లోని సర్వర్లను హ్యాక్‌ చేసి హెచ్‌డీ కాపీలు డౌన్‌లోడ్‌ చేసేవాడు. అంతేకాదు.. అతడు పలు ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసి, ఉద్యోగుల వివరాలను చూసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని సీపీ తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌ను కూడా అతడు హ్యాక్‌ చేసినట్లు గుర్తించామన్నారు. పట్నాలోని అతడి ఇంటికి తమ టీమ్‌ వెళ్లినప్పుడు.. అతడి ఇంటిచుట్టూ 22 సీసీ కెమెరాలున్నాయని.. పోలీసులను చూడగానే అతడు తన మొబైల్‌లో డేటాను డిలీట్‌ చేశాడని.. హార్డ్‌డి్‌స్కలో డేటా మాత్రం డిలీట్‌ చేయలేకపోయాడని.. హిట్‌-3 సహా ఇటీవల విడుదలైన పలు తెలుగు చిత్రాలు అందులో దొరికాయని చెప్పారు. ఈ పైరేటెడ్‌ కాపీల్లో వాణిజ్య ప్రకటనలు ఇచ్చిన బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌ల నిర్వాహకుల నుంచి ఈ ముఠా నెలకు రూ.9 లక్షలు చొప్పున క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకున్నట్టు తెలిపారు.

సినీ ప్రముఖుల కృతజ్ఞతలు..

అంతర్రాష్ట్ర పైరసీ ముఠాను పట్టుకున్న నేపథ్యంలో.. సీపీ సీవీ ఆనంద్‌ సోమవారం సినీ పెద్దలతో సమీక్ష నిర్వహించారు. పైరసీ ముఠా దందా గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జున, నాని, రామ్‌, తెలంగాణ ఫిలిం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజు, నిర్మాత సురేశ్‌ బాబు తదితరులు హాజరయ్యారు. చిత్రపరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్న పైరసీ ముఠాను పట్టుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు వారంతా కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 30 , 2025 | 04:33 AM