International Short Film Festival: హైదరాబాద్‌లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:07 AM
ఈ నెల 19 తేదీ నుంచి 21 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ ఖ్యాతిని పెంచేలా ఉంటుందని పర్యాటక అభివృద్ధి....
19 నుంచి 21 వరకు : టూరిజం ఎండీ క్రాంతి
హైదరాబాద్, డిసెంబర్ 11(ఆంధ్రజ్యోతి): ఈ నెల 19 తేదీ నుంచి 21 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ ఖ్యాతిని పెంచేలా ఉంటుందని పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. యూరప్, అమెరికాతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 700 లఘు చిత్రాలు ఈ ఫెస్టివల్‌కు వచ్చాయని వెల్లడించారు. కొత్తగా సినీ పరిశ్రమలోకి వచ్చేవారికి ఈ ఫెస్టివల్ గొప్ప వేదిక అవుతుందనని పేర్కొన్నారు. గురువారం టూరిజం ప్లాజాలో తెలంగాణ ఫిలిం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంకతో కలిసి వల్లూరు క్రాంతి.. ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సంబధించిన కర్టెన్ రైజర్‌ను ఆవిష్కరించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన సినిమాల ప్రోమోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రదర్శనకు అధికారికంగా ఎంపికైన 60 చిత్రాల నిర్మాతలను అభినందించారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అధినేత, అంకురం దర్శకుడు ఉమా మహేశ్వర్‌రావు మాట్లాడుతూ.. మూడు రోజులపాటు ఫిలిం ఫెస్టివల్ నిర్వహించి వదిలేయకుండా, తరువాత కూడా సినిమాలు పంపినవారికి, సినిమాలు చూసినవారికి అవగాహన సదస్సు నిర్వహిచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.