Heart Attack: గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:58 AM
బాగ్‌అంబర్‌పేటలోని ఓ కార్పొరేట్ కళాశాలలో పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థి గుండెపోటుకు గురై మృతి చెందాడు. నగరంలోని రాంనగర్‌కు చెందిన శ్రీనివాస్, స్వాతి దంపతుల కుమారుడు....
కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లేనని.. తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆరోపణ
రాంనగర్/అంబర్‌పేట, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : బాగ్‌అంబర్‌పేటలోని ఓ కార్పొరేట్ కళాశాలలో పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థి గుండెపోటుకు గురై మృతి చెందాడు. నగరంలోని రాంనగర్‌కు చెందిన శ్రీనివాస్, స్వాతి దంపతుల కుమారుడు కె.వి.ఎ్‌స.ప్రణవ్‌రాయ్ సాయి(17) బాగ్‌అంబర్‌పేటలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రణవ్‌రాయ్ సాయిని స్లిప్ టెస్ట్ కోసం అతని తండ్రి శ్రీనివాస్ కళాశాల వద్ద దింపి వెళ్లిపోయాడు. పరీక్ష రాసే సమయంలో అతనికి అనుకోకుండా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రణవ్‌రాయ్ సాయికి చిన్నప్పుడే గుండెకు సంబంధించిన చికిత్స జరిగిందని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రభుత్వం శుక్రవారం సెలవు ఇచ్చినా కళాశాల యాజమాన్యం పరీక్షలు నిర్వహించడం... ప్రణవ్‌రాయ్‌సాయి పరీక్ష రాయాల్సిన హాల్ కళాశాల భవనంలో కిందే ఉండగా.. పై ఫ్లోర్‌లో ఉందంటూ పైకి అనంతరం కిందకు మెట్లపై పంపించడం వల్లనే ఒత్తిడికి గురై గుండెపోటుతో చనిపోయాడని కళాశాలకు చెందిన విద్యార్థులతోపాటు పలు విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, ప్రణవ్‌రాయ్‌సాయి స్నేహితులు, బంధువులు అతడి ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్, స్వాతి కన్నీటి పర్యంతమయ్యారు.