Intermediate Exams: 1,488 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:44 AM
వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్ పరీక్షలపై ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య మంగళవారం జల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు....
600 మంది విద్యార్థులకొక పరీక్షా కేంద్రం
ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్ పరీక్షలపై ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య మంగళవారం జల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి ప్రథమ, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంఽధించి అన్ని జిల్లాల ఇంటర్ విద్య అధికారులతో కృష్ణ ఆదిత్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులకు అన్ని వసతులున్న కాలేజీల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రంలో సీసీటీవీలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి 600 విద్యార్థులకు ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటుచేయాలని తెలిపారు. గత ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1532 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి 1488 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. కాగా ఇప్పటికే ప్రకటించిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. హోళీ పండగ సెలవు ఒక రోజు ముందుకు మారడంతో మార్చి3న జరగనున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితశాస్త్రం-2ఏ, వృక్షశాస్త్రం (బాటనీ), రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) పరీక్షలను మరుసటి రోజు (మార్చి4న) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు మంగళవారం సవరించిన షెడ్యూల్ విడుదలచేసింది.