Minister Ponguleti: ముమ్మరంగా మరమ్మతు పనులు
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:32 AM
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రహదారులు, వంతెనల మరమ్మతు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని...
ముందస్తు చర్యలతో తగ్గిన వరద నష్టం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రహదారులు, వంతెనల మరమ్మతు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వరద నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలు, మరమ్మతులపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. అయితే, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఆస్తి , ప్రాణ నష్టం తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలను వేగవంతం చేయాలని, బాధితులు పరిహారం కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదని అధికారులను ఆదేశించారు. కాగా, తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, కార్యదర్శి గౌతమ్ మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేశారు. మరోవైపు నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రిడిటేషన్ పాలసీ, జర్నలి్‌స్టల హెల్త్ పాలసీ, ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు, జర్నలిస్టులపై దాడులను నిరోధించడానికి హైపవర్ కమిటీ ఏర్పాటు తదతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపై కార్మిక, ఆరోగ్య, హోం, ఆర్థిక శాఖల అధికారులతో మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించారు.