Share News

By Election: తెరపైకి రోజుకో కొత్త పేరు!

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:00 AM

సామూహిక సీమంతాలు... సామాజిక సేవా కార్యక్రమాలకు ఒకరు శ్రీకారం చుడితే.. మరొకరు బహుమతులతో మహిళలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు..

By Election: తెరపైకి రోజుకో కొత్త పేరు!

  • జూబ్లీహిల్స్‌ అభ్యర్థిత్వం కోసం కాంగ్రె్‌సలో పెరుగుతున్న ఆశావహులు

  • బహుమతులు, దావత్‌లతో ప్రజలను ఆకట్టుకునే యత్నం.. పార్టీకి తలనొప్పిగా మారిన వైనం

బంజారాహిల్స్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): సామూహిక సీమంతాలు... సామాజిక సేవా కార్యక్రమాలకు ఒకరు శ్రీకారం చుడితే.. మరొకరు బహుమతులతో మహిళలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. బస్తీ నిద్ర పేరిట ఓ నేత హడావుడి చేస్తుంటే.. సీఎం రేవంత్‌ టీమ్‌ పేరిట మరో నేత హంగామా సృష్టిస్తున్నారు. ఇక, దసరా నేపథ్యంలో దావత్‌లు, ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు సరేసరి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతలు ఎవరికి వారు తమ బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ.. అగ్రనేతలకూ టచ్‌లో ఉంటున్నారు. తొలుత ఇద్దరు, ముగ్గురి పేర్లు తెరపైకి రాగా.. క్రమేణా ఆ సంఖ్య పది వరకు చేరడం ఆసక్తికరంగా మారింది.

గెలిచే సత్తా ఉందని...

ఉప ఎన్నిక అంశం తెరమీదకు వచ్చినప్పుడు కాంగ్రె్‌సలో అజారుద్దీన్‌, నవీన్‌యాదవ్‌ మధ్యే పోటీ ఉంది. అనూహ్యంగా అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో నవీన్‌కు మార్గం సుగమమైందని అందరూ భావించారు. ఆయన సైతం సామూహిక సీమంతాల పేరిట ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు ఆరంభించారు. ఇంతలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ పేరిట నియోజకవర్గంలో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. మరోవైపు.. సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సైతం అభ్యర్థిత్వం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గణనీయ సంఖ్యలో ఓట్లు ఉన్న రెండు కులాల అండ తనకు ఉందని, అవకాశం ఇస్తే తప్పకుండా గెలుస్తానని పార్టీ నేతల వద్ద చెబుతున్నారు. అలాగే, మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్‌ కోడలు కంజర్ల విజయలక్ష్మి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్లూ వినిపిస్తున్నాయి. మాజీ కార్పొరేటర్‌ మురళీగౌడ్‌ బస్తీ నిద్ర పేరిట ప్రజల వద్దకు వెళ్తుండగా, బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన రహ్మత్‌నగర్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి కూడా అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. దసరా నేపథ్యంలో టీమ్‌ రేవంత్‌రెడ్డి పేరిట మైనంపల్లి హన్మంతరావు అనుచరులు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. మైనంపల్లికి టికెట్‌ పక్కా అంటూ ఆయన అనుచరులు ఊదరగొడుతున్నారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సైతం బీసీ కోటాలో బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అనర్హత వేటు పడే అవకాశం ఉన్న దృష్ట్యా.. ఉప ఎన్నికలో అవకాశం కల్పిస్తే గెలిచి తీరుతానని చెబుతున్నారు.


హైదరాబాద్‌పై పట్టు సాధించాలని..

గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా హస్తం హవా కనిపించినా.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మాత్రం ఎదురుగాలి వీచింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఇక్కడ విజయం సాధిస్తే.. హైదరాబాద్‌లో పార్టీకి పట్టు పెరుగుతుందన్న సంకేతాలు ఇవ్వడంతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకూ కలిసి వస్తుందని భావిస్తోంది. అదే సమయంలో బీఆర్‌ఎ్‌సకు చెక్‌ పెట్టినట్టవుతుందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో గెలుపు గుర్రాన్ని బరిలో దించాలని భావిస్తోంది. అయితే, ఆశావహులు ఎక్కువగా ఉండడం, అభ్యర్థులు ఎవరికి వారు తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటుండడం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఆశావహులు పరస్పర విమర్శలు చేసుకోవడం, ఫ్లెక్సీలపై గొడవలు పెట్టుకోవడం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసుకుంటుండడం.. పార్టీకి ప్రతికూలంగా మారుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Oct 05 , 2025 | 09:28 AM