President Draupadi Murmu: నిజాయితీ, నైతికతే గీటురాయి
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:02 AM
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే నియామక పరీక్షల్లో పారదర్శకతకు పెద్దపీట వేయాలని..
ఉద్యోగుల ఎంపికలో వీటికే ప్రాధాన్యమివ్వాలి
అవకాశాల్లోనే కాదు.. ఫలితాల్లోనూ సమానత్వం
పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హైదరాబాద్/అల్వాల్, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే నియామక పరీక్షల్లో పారదర్శకతకు పెద్దపీట వేయాలని.. నిజాయితీ, నైతిక విలువలున్నవారు ఎంపికయ్యేలా ప్రాధాన్యంఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. సమానత్వ ఆదర్శం అవకాశాల్లో మాత్రమే కాకుండా.. ఫలితాల్లోనూ కనిపించేలా కృషి చేయాలని కోరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్ల రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ర్టాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పాత్ర, వాటి విధులకు రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతోపాటు హోదాలోనూ, అవకాశాల్లోనూ సమానత్వం అనే మన రాజ్యాంగ ఆదర్శాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధి నిర్వహణలో అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమానత్వం, న్యాయాన్ని ప్రోత్సహిస్తూ.. మార్పులకు ప్రతినిధులుగా కమిషన్లు పనిచేయాలని సూచించారు. నిజాయితీ, చిత్తశుద్ధి అత్యంత ప్రధానమైనవని, వాటి విషయంలో రాజీపడరాదని తెలిపారు. నైపుణ్యాలు, సామర్థ్యాల లేమిని అభ్యసన కార్యక్రమాల ద్వారా అధిగమించవచ్చు కానీ.. సమగ్రత లోపించడం వల్ల ఎదురయ్యే తీవ్రమైన సవాళ్లను అధిగమించడం సాధ్యం కాకపోవచ్చని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. అణగారిన, బలహీన వర్గాలవారి కోసం పనిచేయాలన్న ఆసక్తి... ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉండాలని అన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్థి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌కు అన్ని స్థాయిల్లో అత్యంత సమర్థమైన పాలనా వ్యవస్థలు అవసరమని తెలిపారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో యూపీఎస్సీ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.
రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ రెండో ఎడిషన్‌ను ప్రారంభించారు. భారతదేశ హరిత సంప్రదాయాలు, సుస్థిర వ్యవసాయ పద్ధతులు, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ 9 రోజుల వ్యవసాయం, ఉద్యానఉత్సవాన్ని 2026 జనవరి 3 నుంచి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ ఉత్సవం ద్వారా వ్యవసాయ, ఉద్యానవన రంగాలలో దేశం సాధిస్తున్న పురోగతిని ప్రజలకు వివరించటంతోపాటు ప్రకృతి పరిరక్షణ, పర్యావరణంపై అవగాహన కల్పిస్తారు. 2026 జనవరి 3 నుంచి 11 వరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఉత్సవం ఉంటుంది. ఈ ఉత్సవానికి ప్రవేశం ఉచితం. వ్యవసాయ శాఖతో కలిసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది.