Share News

kumaram bheem asifabad- బీమాతో అన్నదాతకు ధీమా

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:11 PM

వ్యవసాయంపై ఆధారపడ్డ అన్నదాతల కుటుం బాలకు రైతు బీమా పథకం చేదోడుగా నిలుస్తోంది. పెద్ద దిక్కు అకస్మాత్తుగా ఎదైనా కారణంతో చనిపోతే ఆ కుటుంబమంతా రోడ్డన పడుతుంది. ఏమీ చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది.

kumaram bheem asifabad- బీమాతో అన్నదాతకు ధీమా
లోగో

- మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

వాంకిడి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంపై ఆధారపడ్డ అన్నదాతల కుటుం బాలకు రైతు బీమా పథకం చేదోడుగా నిలుస్తోంది. పెద్ద దిక్కు అకస్మాత్తుగా ఎదైనా కారణంతో చనిపోతే ఆ కుటుంబమంతా రోడ్డన పడుతుంది. ఏమీ చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రైతు భీమా పథకాన్ని అమలు చేస్తుంది. రూ. 5 లక్షల చొప్పున అందిస్తూ ఆసరగా నిలుస్తుంది. 14 ఆగస్టు 1966 నుండి 14 ఆగస్టు 2007 మధ్యలో పుట్టి 18-59 మధ్య వయస్సున్న పట్టాదారులు మాత్రమే ఇందుకు అర్హులు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఇందులో కొత్తగా చేరేందుకు అవకాశం కల్పించింది. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరణలను ప్రారంభించిన వ్యవసాయ అధికారులు ఆగస్టు 13 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 14 నుంచి బీమా పతకాన్ని రెన్యూవల్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్తగా పట్టా పాస్‌పుస్తకాలు వచ్చిన రైతులు దరఖాస్తుఫామ్‌తో పట్టాదారు పాస్‌ పుస్తకం, పట్టాదారు ఆధార్‌కార్డు, నామిని ఆదార్‌ కార్డుతో వ్యవసాయ విస్తరణ అధికారికి దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది. రైతు కుటుంబాల్లో పెద్ద దిక్కుగా ఉండి అకాల మరణం సంభవించిన ప్పుడు వారి కుటుంబాలు రోడ్డన పడకుండా ఉండేందుకు వారికి చేదోడుగా నిలిచేందుకు ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేస్తోంది. 2018 ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. నామినీకి రూ. 5 లక్షల బీమా వర్తించేలా నిర్ణయించారు. రైతు చనిపోయినప్పుడు వ్యవసాయ అధికారులు వివరాలు సేకరించి నామి నీ ఖాతాల్లో పరిహారం జమయ్యేలా చేస్తున్నారు. తొలి రెండు సంవత్సరాలు ఎప్పటికప్పుడు దరఖాస్తులు స్వీకరించారు. 2020 నుంచి ప్రతి వానాకాలంలో ఒక సారి మాత్రమే అర్హుల నుంచి సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. పథకంలో చేరిన రైతు పేరట ప్రభుత్వం ఎల్‌ఐసీకి రూ. 3,457 ప్రీమియం చెల్లిస్తుంది.

- నిబంధనలు ఇలా..

లబ్ధిదారుడి వయస్సు పక్కాగా తెలుసుకునేందుకు ఆధార్‌కార్డు ప్రమాణికం చేశారు. ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరిలోనిది మాత్రమే బీమాకు అవకాశం ఉంటుంది. స్వయంగా బీమా ఫారాన్ని వివరాలతో నింపి సంతకం చేయాలి. పట్టాపాసుపుస్తకం లేదా తహసీల్‌ కార్యాలయం కాపీ, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌, ఖాతా వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు అందించాలి. అధికారులు ఆయా వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. క్లష్టర్‌ కార్యాలయాల్లో ఏఈవోలు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్తగా పట్టాపుస్తకం పొందిన వారే దరఖాస్తు చేసుకోవచ్చు. 59 ఏళ్లు నిండిన వారి పేర్లను జాబితనుంచి తొలగిస్తారు. దరఖాస్తుల స్వీకరణ గడువు సమీపిస్తున్నందుకు రైతులు ముందుకు రాకపోతే మళ్లీ ఏడాది వరకు వేచి ఉండాల్సి వస్తుంది.

- సద్వినియోగం చేసుకోవాలి..

మిలింద్‌ కుమార్‌- ఏడీఏ ఆసిఫాబాద్‌

రైతు బీమా పథకంలో చేరడానికి అవకాశం వచ్చింది. వ్యవసాయశాఖ నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆగస్టు 13 వరకు మాత్రమే గడువు ఉంది. సకాలంలో దరఖాస్తులు చేసుకోకపోతే మళ్లీ ఏడాది వరకు వేచి ఉండాల్సి వస్తుంది. రైతులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - Aug 10 , 2025 | 11:11 PM