లంచం ఇస్తేనే..బీమా సొమ్ము
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:52 PM
కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోసం ఎంతకైనా సిద్ధమవుతున్నారు. ఏ మాత్రం మానవత్వం కూడా లేకుండా చివరికి మృతి చెందిన వారి కుటుంబానికి రావాల్సిన బీమా సొమ్ము చెల్లించేందుకు కూడా లంచం డిమాండ్ చేస్తున్నారు.
ఏసీబీకి పట్టుబడ్డ కార్మిక శాఖ అధికారులు
మంచిర్యాలలో ఒకరు.. బెల్లంపల్లిలో మరొకరు
బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
నస్పూర్/బెల్లింపల్లి జూలై 18 (ఆంధ్రజ్యోతి) : కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోసం ఎంతకైనా సిద్ధమవుతున్నారు. ఏ మాత్రం మానవత్వం కూడా లేకుండా చివరికి మృతి చెందిన వారి కుటుంబానికి రావాల్సిన బీమా సొమ్ము చెల్లించేందుకు కూడా లంచం డిమాండ్ చేస్తున్నారు. కానీ చివరికి ఏసీబీకి పట్టుబడుతున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లిలో కార్మిక శాఖ అధికారులపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల అసిస్టెంట్ లెబర్ ఆఫీసర్ (కాగజ్‌నగర్ ఇన్‌చార్జి) కాటం రాంమోహన్ రూ. 50వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడి సోదరుడు భవన నిర్మాణ రంగంలో కార్మికుడిగా పని చేస్తూ కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. లెబర్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రమాద బీమా మొత్తం రూ. 6.30 లక్షలు మృతుడి కుటుంబానికి రావాల్సి ఉంది. ఆ డబ్బుల కోసం మంచిర్యాల అసిస్టెంట్ లెబర్ ఆఫీసర్ రాంమోహన్‌ను బాధితులు సంప్రదిస్తే ఆయన రూ. లక్షా 50 వేలు లంచం డిమాండ్ చేసాడు. తమ వద్ద అన్ని డబ్బులు లేదని చెప్పడంతో చివరకు 50వేలకు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచనల మేరకు శుక్రవారం మంచిర్యాలలో అధికారి రాంమోహన్ ఇంట్లో రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాంమోహన్‌ను అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు.
బెల్లంపల్లిలో రూ. 30వేలు తీసుకుంటుండగా
------------------------------------------------
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి సహాయ కార్మిక అధికారి కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. లంచం తీసుకుంటుండగా సహాయ కార్మిక అధికారితో పాటు అసిస్టెంట్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి పట్టణానికి చెందిన నరాల శంకర్ బిల్డింగ్ లేబర్ వర్కర్‌గా పని చేసేవాడు. గత సంవత్సరం ఏప్రిల్‌లో అనారోగ్యంతో ఆయన మృతి చెందాడు. మృతుడికి లేబర్‌కార్డు ఉండడంతో ప్రభుత్వం నుంచి రూ.లక్షా30వేల బీమా డబ్బులు రావాల్సి ఉంది. ఆడబ్బుల కోసం మృతుడి భార్య లేబర్ కార్యాలయంలో విధులు నిర్వహించే సహాయ కార్మిక అధికారి సుకన్యను సంప్రదించింది. దీనికి ఆమె రూ.40వేల డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో బాధితురాలు ఈ నెల 8న మంచిర్యాల ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శుక్రవారం బాధితురాలు లేబర్ కార్యాలయానికి వెళ్లి 30వేల నగదు తీసుకొచ్చానని సుకన్యకు తెలిపింది. దీంతో ఆమె అసిస్టెంట్ రాజేశ్వరిని పిలిచి డబ్బులు తీసుకోవాలని సూచించింది. బాధితురాలు అసిస్టెంట్ రాజేశ్వరికి లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరినీ కస్టడీలోకి తీసుకొని శనివారం కోర్టులో హాజరు పరుస్తున్నామన్నారు.