kumaram bheem asifabad- ఉపాధి కూలీలకు బీమా భరోసా
ABN , Publish Date - Jul 13 , 2025 | 10:48 PM
వలసల నివారణకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ఎంతోమందిని ఆదుకుంటుంది. వారంతా నిరుపేదలే. కూలీలు పనులు చేసే చోట ఏదైనా ప్రమాదం జరిగితే వారిని ఆదుకునేలా బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో చేరితే బాధితులకు పరిహారం అందించనున్నారు.
బెజ్జూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): వలసల నివారణకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ఎంతోమందిని ఆదుకుంటుంది. వారంతా నిరుపేదలే. కూలీలు పనులు చేసే చోట ఏదైనా ప్రమాదం జరిగితే వారిని ఆదుకునేలా బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో చేరితే బాధితులకు పరిహారం అందించనున్నారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని అమలుతో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 2.50లక్షల మంది కూలీలకు భరోసా దక్కనుంది. ఈ పథకంలో చేరిన వారు మరణించినా, ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం కలిగినా రూ.2లక్షల పరిహారం చెల్లిస్తారు. ఒకవేళ పాక్షిక అంగవైకల్యమైతే రూ.లక్ష పరిహారం అందిస్తారు. ఉపాధి కూలీలంతా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో చేరేందుకు గడువు విధించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఫారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది నమోదుకు శ్రీకారం చుట్టారు. ఏపీవోలు, టీఏలు, క్షేత్రసహాయకులు పేర్లు నమోదు చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, కూలీలతో అనుమతి ఇస్తూ బ్యాంకు ప్రతినిధులకు లేఖలు అందజేయనున్నారు. ఈ నెల 31వరకు గడువు విధించారు. ఈ పథకం కింద నమోదుకు 18నుంచి 70ఏళ్లలోపు వారు అర్హులు. బ్యాంకు ఖాతా ఉన్నచోట కూలీలు తమ పేర్లు నమోదు చేయించుకోవాలి. ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి. బీమా పథకంలో పేరు నమోదు చేయించాక, ఏటా తమ ఖాతా నుంచి రూ.20బీమాకు జమ చేయాలని రాత పూర్వకంగా లేఖ ఇవ్వడం తప్పనిసరి. ఇది ఇస్తేనే అమల్లోకి వస్తుంది.
- చెల్లింపుల్లో సమస్య..
కానీ కూలీలకు బీమా ప్రీమియం చెల్లంపు సమస్యగా మారింది. వారు కచ్చితంగా బ్యాంకుకు వెళ్లి నమోదు చేసుకోవల్సి ఉంటుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు దూరంగా ఉండడంతో ఇబ్బందులు ఎదరవుతున్నాయి. చాలా మంది కూలీలు తమ వేతనాలను సీఎస్పీ కేంద్రాలు, నగదు రహిత లావాదేవీల ద్వారా తీసుకుంటున్నారు. దూర ప్రాంతాల్లోని బ్యాంకుకు వెళ్లడం కష్టంగా ఉండడంతో లక్ష్య సాధనపై ప్రభావం చూపనుం ది. దీంతో జాబీకార్డు కలిగిన ప్రతి ఒక్కరూ బీమా ప్రీమియం నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోకున్నారు.