Telangana Politics: అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:17 AM
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది ఎమ్మెల్యేలలో ప్రకా్‌షగౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిలపై దాఖలైన...
పిటిషన్‌దారులను క్రాస్ ఎగ్జామిన్ చేసిన న్యాయవాదులు
రేపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్న పిటిషన్‌దారుల న్యాయవాదులు
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది ఎమ్మెల్యేలలో ప్రకా్‌షగౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిలపై దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. స్పీకర్ ప్రసాద్‌కుమార్ చాంబర్లో సోమవారంనాడు ఒక్కో ఎమ్మెల్యేపై దాఖలైన పిటిషన్‌కు ఒక్కో గంట చొప్పున కేటాయించి విచారణ నిర్వహించారు. ఈ విచారణకు పిటిషన్‌దారులుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు.. వారి తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. తొలి రోజున ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని, ఇప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులుగానే కొనసాగుతున్నారంటూ బలమైన వాదనలు వినిపించారు. పిటిషన్‌దారులను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. పార్టీ మారినట్లుగా పిటిషన్‌దారులు తమ అఫిడవిట్‌లలో ఇచ్చిన ఆధారాలపై ప్రశ్నలు వేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ.. సాయంత్రం 5 గంటల వరకూ సాగింది. ఇదే నలుగురు ఎమ్మెల్యేల మీద పిటిషన్లపై బుధవారంనాడూ విచారణ కొనసాగనుంది. బుధవారంనాటి విచారణలో.. పిటిషన్‌దారుల న్యాయవాదులు ఆ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. కాగా.. విచారణ ముగిసిన అనంతరం.. అసెంబ్లీ బయట మీడియాతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున వచ్చిన న్యాయవాది అసంబద్దమైన ప్రశ్నలు వేస్తూ తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేశారని, అయినా ఓపికతో సమాధానం చెప్పామన్నారు. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ నిస్సిగ్గుగా చెబుతున్నారన్నారు. పార్టీ మారి అధికారాన్ని అనుభవిస్తున్న వారిపై అనర్హత వేటు వేయాలని స్పష్టంగా చెప్పామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.