Innovative Student Creations Steal: ఆకట్టుకున్న వినూత్న ఆవిష్కరణలు..!
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:32 AM
గ్లోబల్ సమ్మిట్‌లో ప్రదర్శించిన వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, మార్కెట్, మహిళా ఆధారిత రంగాలకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలను విద్యార్థులు ప్రదర్శించారు. ముఖ్యంగా వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాణిజ్య ఎలక్ట్రికల్ యుటిలిటీ వాహనం ఆకట్టుకుంది.....
గ్లోబల్ సమ్మిట్‌లో ప్రదర్శించిన వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, మార్కెట్, మహిళా ఆధారిత రంగాలకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలను విద్యార్థులు ప్రదర్శించారు. ముఖ్యంగా వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాణిజ్య ఎలక్ట్రికల్ యుటిలిటీ వాహనం ఆకట్టుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినులు తయారుచేసిన మల్టీపర్పస్ అగ్రికల్చర్ మెషీన్ కూడా వ్యవసాయ రంగానికి దోహదపడేలా ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్సీ సంక్షేమ హాస్టల్ విద్యార్థి గగన్‌చంద్ర తయారుచేసిన ‘త్రీ ఇన్ వన్ సైకిల్’.. సంగారెడ్డి ఏటీసీ విద్యార్థుల మల్టీపర్పస్ మూవబుల్ రోబో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సాగులో సహాయకారి మల్టీపర్పస్ అగ్రికల్చర్ మెషీన్..
వ్యవసాయ రంగంలో అన్ని రకాల పనులు చేసేందుకు రూపొందించిందే మల్టీపర్పస్ అగ్రికల్చర్ మెషీన్.. దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం, నీరు పోయడం, ఎరువులు వేసుకోవడం, పురుగుల మందుల పిచికారీ దీని ద్వారా చేసుకోవచ్చు. ఈ యంత్రం వెనుక హ్యాండిల్ ఉంటుంది. దీనికి కరెంట్ సరఫరా ఉన్నా లేకపోయినా నడుపుకోవచ్చు. ఒకవేళ కరెంటు అవసరమైతే.. ఒక డీసీ మోటర్‌కు 5 ఓల్ట్స్ బ్యాటరీ కనెక్ట్ చేసుకోవచ్చు. పురుగుల మందులు చల్లుకోవాలనుకుంటే.. పెస్టిసైడ్ బాక్స్ కూడా ఉంటుంది. ఒకే మెషీన్‌తో అన్ని రకాలు సాగు పనులు చేసుకునేందుకు ఈ యంత్రాన్ని రూపొందించామని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంటర్ (ఎంపీసీ) విద్యార్థినులు వైష్ణవి, రనూషలు తెలిపారు.

వీధి వ్యాపారులకు అండగా ఈ వాహనం
చిరు వ్యాపారుల కోసం ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించారు. వీధి వ్యాపారులకు అనుగుణంగా వాణిజ్య ఎలక్ట్రిక్ యుటిలిటీ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. దీనికి ఒకసారి చార్జింగ్ పెడితే 100 కి.మీ. ప్రయాణించొచ్చు. 500 కిలోల బరువు మోస్తుంది. వాహనం సీటుపైన వంట చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని ఖరీదు లక్ష. అద్దెకు తీసుకోవాలనుకుంటే రోజుకు 250-300 వరకు కిరాయి ఉంటుంది. వాహన పనితీరును పరేశ్ మిశ్రీ వివరించారు.
దూసుకెళ్లే ‘త్రీ ఇన్ వన్ సైకిల్’!
సాధారణ సైకిల్‌ను.. సోలార్ పవర్‌తో పాటు ఎలక్ట్రిక్ బ్యాటరీతో అనుసంధానించి ‘త్రీ ఇన్ వన్ సైకిల్’ను నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్సీ సంక్షేమ హాస్టల్ ఉంటూ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ బల్మూర్ పాఠశాలలో చదివే గగన్ చంద్ర తయారుచేశాడు. ‘ఇది మూడు రకాలుగా నడుస్తుంది. సాధారణంగా సైకిల్‌ను పెడలింగ్ విధానంలో మాత్రమే వాడతారు. కానీ ఈ సైకిల్‌ను సోలార్ పవర్‌తోనూ చార్జ్ చేసి వాడుకోవచ్చు. ఇక ఎలక్ట్రిక్ బ్యాటరీని చార్జింగ్ చేసుకుంటే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఇక ఈ సైకిల్‌కు కారు తరహాలో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. దీంతో ఎవరైనా తీసుకెళ్లాలని ప్రయత్నించినా వెంటనే అలారం మోగుతుంది. సైకిల్ ముందుభాగంలో ఏర్పాటు చేసిన స్ర్కీన్‌లో గూగుల్ మ్యాప్ ద్వారా నావిగేషన్ ఉపయోగించొచ్చు. అత్యవసర సమయాల్లో అవసరమైన వారికి ఫోన్ చేసే వెసులుబాటు కూడా ఈ సైకిల్‌లో ఏర్పాటుచేశాం’ అని గగన్‌చంద్ర వివరించాడు.
అన్ని పనులు చేసే మల్టీపర్పస్ రోబో..!
గడ్డి కోయడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి పలు ఇతర పనులకు మల్టీపర్పస్ మూవబుల్ రోబోను సంగారెడ్డి జిల్లా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) విద్యార్థులు భవానీ తేజ, భానుప్రకాశ్‌లు తయారుచేశారు. పదో తరగతి వరకు చదివిన వీరిద్దరూ ఏటీసీలో చేరారు. అందరికీ ఉపయోగపడేలా పరికరం తయారుచేయాలన్న ఆలోచనతో ఈ మల్టీపర్పస్ మూవబుల్ రోబోను రూపొందించారు. దీని తయారీకి 6 నెలల సమయం పట్టిందని, దాదారు రూ.15 వేల వరకు ఖర్చయిందని వారు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఈ రోబో పరిశ్రమలు, వ్యవసాయం, ఇళ్లలో బాగా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 2 గంటల వరకు పనిచేస్తుందని వెల్లడించారు.