kumaram bheem asifabad- నియమాల దీక్ష.. ఆరోగ్య రక్ష..
ABN , Publish Date - Nov 06 , 2025 | 10:38 PM
కార్త్తీకమాసం మొదలు మకర సంక్రాంతి వరకు ఎటు చూసినా అయ్యప్ప దీక్షలు, స్వామియే శరణం అయ్యప్ప...నామస్మ రణలు వినిపిస్తుంటాయి. దీక్షాదారులు ఒక క్రమ పద్ధతిలో మండలం(41రోజులు) జీవనయానం సాగిస్తుండడంతో పుణ్యం, ముక్తిదాయకమైన భావనే కాకుండా ఆరోగ్యం, మానసిక ఔన్నత్వానికి తోడ్పడే ఇహభావన కూడా లభిస్తుంది. అయ్యప్ప భక్తులు దీక్షకాలంలో నల్లటి వస్ర్తాలు ధరిస్తారు. ఈ దుస్తులు ధరించిన వారిపై శని దేవుడి చూపు ఉండదని భక్తుల విశ్వాసం. శాస్ర్తీయంగా చూస్తే చలికాలంలో నల్లని దుస్తులు శరీరానికి వేడినిస్తాయి. మెడలో రుద్రాక్షమాల ధరించడంతో రక్తపోటు, మధుమేహం వంటి వ్యాదులు అదుపులో ఉంచుతాయి.
- సామూహిక పూజలతో సమైక్యతాభావం
బెజ్జూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కార్త్తీకమాసం మొదలు మకర సంక్రాంతి వరకు ఎటు చూసినా అయ్యప్ప దీక్షలు, స్వామియే శరణం అయ్యప్ప...నామస్మ రణలు వినిపిస్తుంటాయి. దీక్షాదారులు ఒక క్రమ పద్ధతిలో మండలం(41రోజులు) జీవనయానం సాగిస్తుండడంతో పుణ్యం, ముక్తిదాయకమైన భావనే కాకుండా ఆరోగ్యం, మానసిక ఔన్నత్వానికి తోడ్పడే ఇహభావన కూడా లభిస్తుంది. అయ్యప్ప భక్తులు దీక్షకాలంలో నల్లటి వస్ర్తాలు ధరిస్తారు. ఈ దుస్తులు ధరించిన వారిపై శని దేవుడి చూపు ఉండదని భక్తుల విశ్వాసం. శాస్ర్తీయంగా చూస్తే చలికాలంలో నల్లని దుస్తులు శరీరానికి వేడినిస్తాయి. మెడలో రుద్రాక్షమాల ధరించడంతో రక్తపోటు, మధుమేహం వంటి వ్యాదులు అదుపులో ఉంచుతాయి. తులసిమాల నుంచి వచ్చే సుగంధం రోగనిరోదకశక్తిని పెంచుతుంది. స్పటిక, తామర, పగడాల మాలలతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక పల్లెలు, పట్టణాల్లో అయ్యప్ప దీక్షాదారుల సందడి మొదలైంది. పల్లె, పట్టణం అని తేడా లేకుండా అయ్యప్ప నామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఎక్కడ చూసినా ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది. అయ్యప్ప మాలధారులు కఠినమైన నిబంధనలు పాటిస్తూ స్వామి వారి సేవలో నిమగ్నమవుతున్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఒంటిపూట భోజనం, అనుక్షణం అయ్యప్ప నామస్మరణ చేస్తూ తరిస్తున్నారు. ఏటా కార్తీకమాసంలో అయ్యప్ప దీక్షను స్వీకరించి 41రోజుల పాటు నియమాలతో కూడిన దీక్షను పాటిస్తారు. ఏదైనా ఒక పనిని 41రోజుల పాటు చేస్తే అది జీవితంలో బాగం అయిపోతుం దంటారు. అందుకే అయ్యప్ప దీక్షను 41రోజులు పాటిస్తారని భక్తులు విశ్వసిస్తారు. కఠిన దీక్షతో, క్రమశిక్షణ, ఆహార, వ్యవ హారాల్లో మార్పు వస్తుందని మాలధారులు చెబుతారు. మాలధారణ చేపట్టిన అయ్యప్ప స్వాములు వేకువ జామున నాలుగు గంటలకే మేల్కొని చన్నీటితో స్నానాలు ఆచరించి స్వామికి భక్తి శ్రద్దలతో నిత్యం పూజలు చేస్తారు. మాలధారణ చేపట్టిన స్వాములు అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తూ ఉంటారు. రాత్రి వేళ అల్పాహారం లేదా పండ్లు తిని నిద్రకు ఉపక్రమిస్తారు. రాత్రి సమయంలో భజన పాటలతో నిత్యం స్వామికి పూజలు చేస్తారు.
ఆరోగ్య ప్రయోజనాలు అనేకం..
దీక్ష ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. భక్తిభావం తో పాటు ఆహార అలవాట్లలో మార్పుల కోసం అనేక మంది ఈ దీక్షను తీసుకుంటారు. ఉదయన్యే నిద్ర లేవడం చైతన్యానికి ప్రతీకగా , సుర్యోదయానికి ముందే చన్నీటి స్నానంతో నాడీ వ్యవస్థ ఉత్తేజపరుచడం, నేల మీత పడుకోవడం ద్వారా వెన్నునొప్పుల సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతారు. కండరాల పటిష్టత, రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడేందుకు దోహ దపడుతుంది. నిత్యదీపారాధనతో మనసు తేలికపడి స్నేహం, ప్రేమానురాగాలు పెరుగుతాయి. పొగ తాగడం, మద్యపానం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా ఆరోగ్యం మెరుగు పడుతుంది. కాగా దీక్ష చేపట్టిన స్వాములు శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఇందులో ముఖ్యంగా కన్నె స్వాములు తప్పకుండా యాత్ర చేయాల్సి ఉంటుంది. ఇందులో బాగంగా పెద్ద పాదం చేపట్టే వారు కేరళలోని ఎరిమేలి వరకు వాహనాల్లో చేరుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ అటవీ మార్గంలో 45కిలో మీటర్లు ప్రయాణించి ఆలయానికి వెళ్తారు. మార్గం మద్యలో కాలికట్ట ఆశ్రమానికి చేరుకుంటారు. అళుదానదిని దాటి కలిడం కొండ, కరిమల కొండ పెరియాన వట్టం, సిరియాస వట్టం గుట్టలపై నుంచి పంబానది మీదుగా వెళ్తారు. పంబా నుంచి చిన్న పాదం మొదలవుతుంది. పెద్దపాదం చేయని అయ్యప్ప స్వాములు బస్సుల ద్వారా పంబాకు నేరుగా చేరుకొని అక్కడి నుంచి నడిచి వెళ్తారు. వృద్ధులకు, నడవలేని వారికోసం అక్కడ డోలి(మోసుకొని వెళ్లేది)సదుపాయం ఉంటుంది. దానికోసం అక్కడ వారు కొంత డబ్బులు తీసుకుంటారు. పంబాలో పవిత్ర స్నానం ఆచరించి ఇరుముడితో కన్నెస్వాములు గణపతికి కొబ్బరికాయ కొట్టి చిన్నపాదం ప్రారంభిస్తారు. అప్పాచి మేడే, నీలిమల కొండ, శరణుగుత్తి కొండపై నుంచి సన్నిధానం వరకు చేరు కుంటారు. అనంతరం 18మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకొని ఇరుముడిని సమర్పిస్తారు. ఇరుముడి ఎత్తుకున్న స్వాములకు మాత్రమే 18మెట్లు ఎక్కేందుకు అక్కడి అధికారులు అనుమతిస్తారు.