Inhumane Treatment of Disabled Man: జగిత్యాల ప్రజావాణిలో అమానుషం
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:38 AM
జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఓ దివ్యాంగుడి పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. కలెక్టర్ వచ్చేటప్పుడు..
కలెక్టర్ వస్తున్నారని దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన సిబ్బంది
బాధితుడు కుర్చీలోంచి జారిపడ్డా కనికరించని వైనం
కలెక్టర్ కళ్ల ముందే దారుణం
జగిత్యాల/హైదరాబాద్. ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఓ దివ్యాంగుడి పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. కలెక్టర్ వచ్చేటప్పుడు అడ్డుగా ఉన్నాడని దివ్యాంగుడని కూడా చూడకుండా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన్ను బయటకు ఈడ్చుకెళ్లారు. జగిత్యాల జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఇక్కడకు తన గోడును వినిపించేందుకు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాజా గంగారాం వచ్చారు. తన ఇంటికి దారి లేదని ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదని గత వారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్‌కు రాజా గంగారాం ఫిర్యాదు అందించారు. అప్పుడు సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఆయనకు కలెక్టర్ హామీ ఇచ్చారు. వారం రోజులు గడుస్తున్నా తన సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో సోమవారం మళ్లీ ప్రజావాణికి వచ్చి ఫిర్యాదులు స్వీకరించే చోట రాజా గంగారం వేచి చూస్తున్నారు. అదే సమయంలో కలెక్టర్ సత్యప్రసాద్ వస్తున్నారని సిబ్బందికి సమాచారం అందడంతో రాజా గంగారాం అడ్డుగా ఉన్నారని పేర్కొంటూ ఆయన్ను అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. సిబ్బంది ఈడ్చుకెళ్తున్న సమయంలో రాజా గంగారాం కుర్చీలోంచి జారీ కిందపడ్డారు. అయినప్పటికీ కనికరం చూపకుండా ఆయన్ను బయటకు ఈడ్చుకెళ్లారు. అమానవీయంగా దివ్యాంగుడిని సిబ్బంది ఈడ్చుకెళ్తుంటే ఎదురుపడ్డ కలెక్టర్ అవేమీ పట్టనట్టు ప్రజావాణి హాల్‌లోకి వెళ్లిపోయారు. దివ్యాంగుడి పట్ల కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన మానవత్వానికి మాయని మచ్చని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా. కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. ఇంత దారుణ ఘటన తన కళ్ల ముందే జరిగినా చూసి చూడనట్టు కలెక్టర్ వెళ్లిపోయారని, ఇక దివ్యాంగులకు గౌరవం ఎక్కడుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ దివ్యాంగుడి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఎంత చెప్పినా వినకపోవడంతోనే: కలెక్టర్ సత్యప్రసాద్
తాము ప్రతి అర్జీదారుడి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ చెప్పారు. అధికారులు ఎంత చెప్పినా వినకుండా రాజా గంగారాం తన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అక్కడి నుంచి కదలనని అర్ధ గంటకు పైగా కూర్చోవడంతో పక్కకు వెళ్ళమని సిబ్బంది అభ్యర్థించారని, అయినా ఆయన వినలేదని చెప్పారు. దాంతో పక్కనే ఉన్న హాల్‌లోకి ఆయన్ను సిబ్బంది తీసుకెళ్లారని, ఆ ప్రయత్నంలో కానిస్టేబుల్ కొంచెం దురుసుగా ప్రవర్తించారని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. తక్షణమే దివ్యాంగుడు రాజా గంగారాం సమస్యను పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.