Industries Seek Clarity: హిల్ట్‌పై మరింత స్పష్టత ఇవ్వండి
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:15 AM
హైదరాబాద్ ఇండస్ర్టియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) విధానంపై స్పష్టతనివ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు...
కేవీఏఆర్‌హెచ్ బిల్లింగ్‌ను నిలిపివేయాలి
టైమ్ ఆఫ్ డే రాయితీని పునరుద్ధరించాలి
ప్రభుత్వాన్ని కోరిన పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ఇండస్ర్టియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) విధానంపై స్పష్టతనివ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈమేరకు బుధవారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో రాష్ట్ర పారిశ్రామిక సంఘాలు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించాయి. సమావేశంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు రవికుమార్, సీనియర్ ఉపాధ్యక్షుడు కేకే మహేశ్వరి, తెలంగాణ ఇండస్ర్టియల్ ఫెడరేషన్(టీఐఎఫ్) అఽధ్యక్షుడు కె.సుధీర్ రెడ్డి, చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ (సీఐఏ) అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) చైర్మన్ స్వామి గౌడ్, తెలంగాణ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అఽధ్యక్షుడు రాజమహేంద్ర, తెలంగాణ ఐరన్ అండ్ స్టీల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ నుంచి అనిల్ అగర్వాల్, ప్రకాష్ గోయెంకా, తెలంగాణ స్టేట్ టూల్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ ప్రతినిధులతోసహా పలు పరిశ్రమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్ పరిధిలోని పారిశ్రామిక భూముల వినియోగాన్ని మార్చాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, ప్రత్యామ్నాయ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై స్పష్టత లేకపోవడం అనిశ్చితిని కలిగిస్తోందన్నారు. పరిశ్రమలను నివాసాల మాదిరిగా తరలించలేమని, అందుకు కొన్నేళ్లు పడుతుందన్నారు. అందుకే ఈ పాలసీని తాత్కాలికంగా నిలిపివేసి పారిశ్రామికవేత్తలతో చర్చించి ముందుకెళ్లాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. అలాగే ఇటీవలికాలంలో అకస్మాత్తుగా తెచ్చిన లీడ్ కెవీఆర్‌ఏహెచ్ బిల్లింగ్‌పై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ విధానంతో విద్యుత్ చార్జీలు మూడు నుంచి ఐదు రెట్లు వరకు పెరిగాయని, ఈ తరహా చార్జీలు పరిశ్రమల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయన్నారు. కేవీఆర్‌ఏహెచ్ బిల్లింగ్‌ను నిలిపివేయాలని కోరారు. మూడు నెలల్లోనే లీడ్ పవర్ ఫ్యాక్టర్ నుంచి బయటకురావాలని డిస్కమ్‌లు పరిశ్రమను బలవంతం చేశాయన్నారు. ఈ విధానం గురించి చర్చించేందుకు పరిశ్రమల సంఘాల ప్రతినిధులు, ఐఐటీలు, విద్యుత్ ఉత్పత్తిదారులు, డిస్కమ్‌లతో ఓ కమిటీ వేయాల్సిందిగా అభ్యర్థించారు. కాగా ఇటీవల తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ వల్ల పెట్టుబడులు నిలిచిపోతున్నాయని కూడా వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు రాత్రి టారి్‌ఫపై యూనిట్‌కు రూ.1.50 టైమ్ ఆఫ్ డే రాయితీని పునరుద్ధరించాలని లేదా పగలు తక్కువ ధరకు లభిస్తున్న సౌరవిద్యుత్‌ను దృష్టిలో ఉంచుకుని డే టారి్‌ఫపై రాయితీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. టారిఫ్ ప్రోత్సాహకాలు లేకుంటే విద్యుత్ బిల్లులు భారంగా మారతాయన్నారు.