Bhatti Vikramarka: పదేళ్లల్లో ఇవ్వని ఉద్యోగాలను ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చాం
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:31 AM
గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా ఇబ్బంది పెడితే, తాము అధికారంలోకి రాగానే గ్రూప్-1, 2 పరీక్షలను నిర్వహించి వేలాది మందికి ఇందిరమ్మ...
ఉనికి కోసమే కొందరి యాత్రలు: భట్టి
బోనకల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా ఇబ్బంది పెడితే, తాము అధికారంలోకి రాగానే గ్రూప్-1, 2 పరీక్షలను నిర్వహించి వేలాది మందికి ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాలిచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ దశల వారీగా అందరికీ ఇళ్లను ఇస్తున్నామన్నారు. ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా బోనకల్ మండలం జానకీపురం, నారాయణపురం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను కుటుంబ సభ్యుల్లా భావిస్తూ అందరికీ సంక్షేమ పథకాలను వర్తింప చేస్తున్నామన్నారు. రాజకీయ ఉనికి కోసమే కొందరు యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కార్యక్రమాలున్నా మధిర నియోజకవర్గంలో రోజువారీ అభివృద్ధి పనుల గురించి సమీక్షిస్తుంటానన్నారు. రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధి విషయంలో ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని కోరారు.