Share News

Indiramma Housing Turns Into a Nightmare: అట్టహాసం.. అపహాస్యం!

ABN , Publish Date - Oct 28 , 2025 | 04:09 AM

సొంత గూడు కోసం నిరీక్షిస్తున్న రాష్ట్రంలోని నిరుపేదలకు కొండంతా భరోసా నింపేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మొదలు పెట్టిన కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు....

Indiramma Housing Turns Into a Nightmare: అట్టహాసం.. అపహాస్యం!

  • ఆదర్శగ్రామంలో అసంపూర్తిగా ఇందిరమ్మ ఇళ్లు.. అ‘ధనం’గా 2 లక్షలిచ్చినా.. పునాదులకే పరిమితం

  • లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంట్రాక్టర్లు

చండ్రుగొండ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సొంత గూడు కోసం నిరీక్షిస్తున్న రాష్ట్రంలోని నిరుపేదలకు కొండంతా భరోసా నింపేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మొదలు పెట్టిన కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు. అందులోనూ.. పూర్తిస్థాయిలో గిరిజన గ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పైలట్‌ ప్రాజెక్టుగా గుర్తించింది. తొలివిడతలో భాగంగా 310 ఇళ్లను మంజూరు చేసింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారులతో కలిసి సాముహిక గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం చేతుల మీదుగా అట్టహాసంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రస్తుతం ఆ గ్రామంలో అపహాస్యంగా మారింది. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఊపందుకోవడం లేదు. ముఖ్యమంత్రి పర్యటన సమయానికి 74 ఇళ్ల స్లాబులు పూర్తి కాగా.. నేటికీ అదే పరిస్థితి ఉందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే ఎంతో కొంత మొత్తంలో అయినా డబ్బు అవసరం. ఇంటి నిర్మాణం చేపట్టాక బిల్లులు వస్తాయో.. రావో అన్న ఆందోళన లో ఉన్న లబ్ధిదారులకు కాంట్రాక్టర్లతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహా పలువురు ఉన్నతాధికారులు హామీలు ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన వరకు ఆ గ్రామంలో ఇళ్ల నిర్మాణం చకచకా సాగిపోయింది. కానీ ఆ తర్వాత పట్టించుకునే నాథుడే కరువైన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి.

పాత మరుగుదొడ్లకు రంగులద్ది ముఖ్యమంత్రికే మస్కా

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి బచ్చల రమణ, బచ్చల నర్సమ్మ అనే ఇద్దరు లబ్ధిదారల ఇళ్లను అధికారులు ఎంపిక చేశారు. అయితే ఆ ఇళ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టరు తూతూమంత్రంగా ఇళ్లను పూర్తి చేసినట్లు ప్రకటించి.. ఆ మేరకు సీఎంతో ప్రారంభింపచేశారు. ఆ రెండు ఇళ్లు నేటికీ అసంపూర్తిగానే ఉండడం గమనార్హం. బచ్చల రమణకు సంబంధించి గతంలో నిర్మించిన పాత మరుగుదొడ్డికి రంగులు అద్దగా... నరసమ్మ మరుగుదొడ్డి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఇళ్ల నిర్మాణం చేసుకోలేని వారికి కాంట్రాక్టర్‌తో కట్టిస్తామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు చెప్పిన మాటలు నమ్మి.. ఉన్న ఇళ్లను తొలగించి, నిర్మాణ పనులు చేపట్టామని లబ్ధిదారులు వాపోయారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 5లక్షలకు అదనంగా రూ. 2 లక్షలు ఇస్తేనే నిర్మాణం సాధ్యమవుతుందని కాంట్రాక్టర్లు మొండికేయడంతో.. చేసేదేమీ లేక కొందరు లబ్ధిదారులు ముందుకొచ్చిఆ కాంట్రాక్టర్లు అడిగినంతా చెల్లించారు. కానీ, పునాదుల వద్దే పనులు నిలిపేసి కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సున్నం సరస్వతి అనే లబ్ధిదారు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం బిల్లులు చెల్లింపుల్లో జాప్యం.. ఇళ్లు నిర్మిస్తున్న వారి అగచాట్లు చూస్తుంటే.. కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు భయపడుతున్నామని మరికొందరు లబ్ధిదారులు చెబుతున్నారు.

Updated Date - Oct 28 , 2025 | 04:09 AM