Share News

Ponguleti Srinivas Reddy: ఎల్లుండి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:37 AM

కులమతాలకతీతంగా పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం ..

Ponguleti Srinivas Reddy: ఎల్లుండి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం

  • భద్రాద్రి జిల్లా బెండాలపాడులో సీఎం చేతులమీదుగా కార్యక్రమం

  • అనంతరం లక్ష మందితో బహిరంగ సభ

  • రేపు గచ్చిబౌలిలో సమీకృత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనానికి సీఎం భూమి పూజ

  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

చండ్రుగొండ/హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కులమతాలకతీతంగా పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయని వెల్లడించారు. అనంతరం లక్షమందితో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బెండాలపాడులో మంత్రి పొంగులేటి పర్యటించారు. పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీ, పలు శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం పొంగులేటి విలేకరులతో మాట్లాడారు. ఇళ్ల కోసం పేదలు పదేళ్లుగా ఎదురు చూశారని, వారి ఆశలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రకటనను సీఎం రేవంత్‌ భద్రాద్రి రాముని సన్నిధిలో ప్రకటించారని.. ఇప్పుడు అదే జిల్లాలో ఇళ్లను ప్రారంభించడం చరిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. తొలి దశలో రూ. 22,500 కోట్లతో మంజూరు చేసిన 4.5 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.


రిజిస్ట్రేషన్‌శాఖను ఆదాయ వనరుగా చూడటం లేదు

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖను తమ ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడటం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఈ నెల 20న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జరగనున్న సమీకృత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ భూమి పూజ కార్యక్రమంపై రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులతో సచివాలయంలో సోమవారం మంత్రి సమీక్ష చేశారు. బుధవారం సీఎం గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్‌ ల్యాండ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(తాలిమ్‌) సంస్థ ఆవరణలో సమీకృత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నారని వెల్లడించారు. ఈ భవనంలో రంగారెడ్డి, గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల సముదాయాల నిర్మాణానికి సంబంధించి తొలి దశలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో 39 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను 11 సమీకృత భవనాల పరిధిలోకి తీసుకురాబోతున్నామని వివరించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌, పెద్ద అంబర్‌పేట్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం కార్యాలయాలను కోహెడ్‌లో.. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌ కార్యాలయాలను మహేశ్వరం మండలం మంకాల్‌లో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, కీసర, శామీర్‌పేట్‌ కార్యాలయాల సముదాయాన్ని కండ్లకోయలో.. ఉప్పల్‌, నారపల్లి, కాప్రా, ఘట్‌కేసర్‌, మల్కాజ్‌గిరి కార్యాలయాలను బోడుప్పల్‌లో.. బంజారాహిల్స్‌, ఆజంపురా, చార్మినార్‌, దూద్‌బౌలి కార్యాలయాలను మలక్‌పేటలో నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు త్వరలోనే ఈ-ఆధార్‌ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని పొంగులేటి తెలిపారు. ఇప్పటికే ఈ విధానాన్ని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - Aug 19 , 2025 | 04:37 AM