Share News

Anti Corruption Bureau: ఇందిరమ్మ ఇంటి బిల్లుకు 20వేలు లంచం

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:52 AM

ఇందిరమ్మ ఇంటి బిల్లుకు సంబంధించిన పనికి రూ.20 వేలు లంచం తీసుకున్న ఓ పంచాయతీ కార్యదర్శి, ట్రేడ్‌ లైసెన్స్‌ జారీకి రూ.7వేలు తీసుకున్న ఓ ఆర్‌ఐ ఏసీబీకి బుధవారం పట్టుబడ్డారు.

Anti Corruption Bureau: ఇందిరమ్మ ఇంటి బిల్లుకు 20వేలు లంచం

  • ఏసీబీకి చిక్కిన మంచిర్యాల జిల్లా కర్ణమామిడి పంచాయతీ కార్యదర్శి

  • ట్రేడ్‌ లైసెన్స్‌ జారీకి రూ.7వేలు లంచం

  • రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన

  • నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఆర్‌ఐ

హాజీపూర్‌, నిజామాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇంటి బిల్లుకు సంబంధించిన పనికి రూ.20 వేలు లంచం తీసుకున్న ఓ పంచాయతీ కార్యదర్శి, ట్రేడ్‌ లైసెన్స్‌ జారీకి రూ.7వేలు తీసుకున్న ఓ ఆర్‌ఐ ఏసీబీకి బుధవారం పట్టుబడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు పునాది వరకు నిర్మాణం చేపట్టిన తర్వాత పంచాయతీ కార్యదర్శి ఫొటో తీసి ఉన్నతాధికారులకు పంపిస్తే మొదటి దఫా బిల్లు మంజూరు అవుతుంది. ఫొటో తీసి పైఅధికారులకు పంపించేందుకు మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలోని కర్ణమామిడిలో డొల్క నాగమణి అనే లబ్ధిదారు వద్ద కర్ణమామిడి పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి రూ.30 వేలు లంచం డిమాండ్‌ చేశారు. నాగమణి బతిమలాడగా రూ.20వేలకు అంగీకరించాడు. అయితే నాగమణి ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆమె నివాసానికి వచ్చి వెంకటస్వామి రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వేర్వేరు పనుల కోసం వెంకటస్వామి తమ వద్ద లంచాలు తీసుకున్నాడని 30 మంది ఏసీబీ అధికారుల వద్ద వాపోయారు. ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.


నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌, ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ) శ్రీనివాసచారి ట్రేడ్‌ లైసెన్స్‌ జారీకి రూ.7000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. నిజామాబాద్‌కు చెందిన ఆర్మీ మాజీ జవాన్‌ ఒకరు ట్రేడ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. లైసెన్స్‌ మంజూరుకు శ్రీనివాసచారి రూ.10వేలు డిమాండ్‌ చేశారు. దీంతో ఆ మాజీ జవాను ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో అతడి నుంచి శ్రీనివాసచారి రూ.7వేలు లంచం తీసుకుంటుంగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Updated Date - Sep 04 , 2025 | 04:54 AM