kumaram bheem asifabad- కౌమార బాలికలకు ‘ఇందిరమ్మ అమృతం’
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:27 PM
కౌమార దశలోని బాలికల్లో రక్తహీనత నివార ణకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఆడ పిల్లలకు శక్తి నిద్దాం... ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో బాలికలకు పోషకాహారం అందించేలా ఇందిరమ్మ అమృతం పథకాన్ని రూపొందించింది. రాష్ట్రంలోని 14 నుంచి 18 ఎళ్ల వయస్సు గల కౌమార దశ బాలికలు పౌష్టికాహర లోపంతో రక్తహీనతకు గురవుతున్నారని గుర్తించి పోషకాలతో కూడిన చిక్కీలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేయనుంది.
- పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లా గుర్తింపు
- అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాలతో కూడిన చిక్కీల పంపిణీ
ఆసిఫాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కౌమార దశలోని బాలికల్లో రక్తహీనత నివార ణకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఆడ పిల్లలకు శక్తి నిద్దాం... ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో బాలికలకు పోషకాహారం అందించేలా ఇందిరమ్మ అమృతం పథకాన్ని రూపొందించింది. రాష్ట్రంలోని 14 నుంచి 18 ఎళ్ల వయస్సు గల కౌమార దశ బాలికలు పౌష్టికాహర లోపంతో రక్తహీనతకు గురవుతున్నారని గుర్తించి పోషకాలతో కూడిన చిక్కీలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేయనుంది. బాలికలలో అత్యధికంగా రక్తహీనత కలిగి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలలను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని పథకాన్ని ప్రయోగాత్మకంగా మే 29న ప్రారంభించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగానికి విధివిధానాలను అప్పగించింది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 5 ప్రకారం తెలంగాణలో 64.7శాతం బాలికలు రక్తహీ నతతో బాధపడుతున్నారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సర్వే ప్రకారం రక్తహీనత అత్యధికంగా నమోదైన మూడు జిల్లాల్లో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కుమరం భీం జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ కేంద్రాల పరిధిలో మొత్తం 18,230 మంది కౌమరదశ బాలికలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పథకం ద్వారా వీరందరికి పోషకాలతో కూడిన చిక్కీలు అందించనుంది. ఇందిరమ్మ అమృతం పథకంలో భాగంగా కౌమర బాలికల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిం చింది. పోషకాహరం కింద పల్లీలు, చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. రోజుకు ఒకటి చొప్పున నెలకు 30 చిక్కీలు నెలలో రెండుసార్లు పంపిణీ చేస్తారు. ఈ చిక్కిలో సుమారు 600 కేలరీలు, 18 నుంచి 20 గ్రాముల ప్రొటీన్లతో పాటు అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి.
- జిల్లా వ్యాప్తంగా ఇలా..
జిల్లాలోని 15 మండలాల్లో మొత్తం 973 అంగన్‌వాడీ కేంద్రాలలో 18,230 మంది కౌమరదశ బాలికలు ఉన్నట్లు గుర్తించారు. ఆసిఫాబాద్ మండలంలో 126 కేంద్రాలలో 2,127 మంది బాలికలు, రెబ్బెనలో 69 కేంద్రాలలో 1,125 మంది, తిర్యాణిలో 65 కేంద్రాలలో 869 మంది, జైనూరులో 76 కేంద్రాలలో 1,301 మంది, లింగాపూర్‌లో 45 కేంద్రాలలో 654 మంది, సిర్పూర్(యూ)లో 54 కేంద్రాలలో 681 మంది, కాగజ్‌నగర్‌లో 130 కేంద్రాలలో 3,086 మంది బాలికలు ఉన్నారు. దహెగాంలో 43 కేంద్రాలలో 833 మంది, బెజ్జూర్‌లో 41 కేంద్రాలలో 998 మంది, చింతలమానేపల్లి మండలంలో 43 కేంద్రాలలో 1080 మంది, పెంచికల్‌పేటలో 52 కేంద్రాలలో 555 మంది, కౌటాలలో 52 కేంద్రాలలో 1240 మంది, సిర్పూర్(టి)లో 45 కేంద్రాలలో 909 మంది, కెరమెరిలో 84 కేంద్రాలలో 1287 మంది, వాంకిడిలో 79 కేంద్రాలలో 1485 మంది కౌమరదశ బాలికలు ఉన్నారు.
కౌమర బాలికలకు అమలు..
- భాస్కర్, జిల్లా సంక్షేమాధికారి
జిల్లాలో 18,230 మంది కౌమర బాలికలకు ఇందిరమ్మ అమృతం పథకాన్ని అమలు చేయనున్నాం. ఈ పథకాన్ని జిల్లాలో ఇటీవల లాంఛనంగా ప్రారంభించాం. త్వరలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పోషకాహార కిట్లు పంపిణీ చేసి బాలికలకు అందజేస్తాం.