Share News

TG Govt: ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీకి సర్వం సిద్ధం

ABN , Publish Date - Nov 17 , 2025 | 06:08 AM

ఇందిరాగాంఽధీ మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది.

TG Govt: ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీకి సర్వం సిద్ధం

  • 67లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు రెండేసి చీరలు

  • ఇందిరాగాంధీ జయంతి రోజున ముహూర్తం

  • ఇప్పటికే జిల్లాల్లోని గోదాములకు సరఫరా

సిరిసిల్ల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఇందిరాగాంఽధీ మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈనెల 19న ఇందిరాగాంధీ జయంతి రోజున 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) మహిళకు రెండేసీ చీరలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల గోదాములకు చీరలు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన డిజైన్లను చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో టెస్కో రూపొందించింది. వాటి ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. నాణ్యమైన చీరలను అందించే దిశగా పలు చర్యలు తీసుకున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకు ఉపాధినిచ్చాయి. అయితే, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక చీరల్లో నాణ్యత లేదన్న కారణంతో వాటి పంపిణీ నిలిపివేసింది. దీంతో వస్త్ర పరిశ్రమ ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయింది. నేతన్నల ఆత్మహత్యలు, ఆందోళనలు వంటి పాత పరిస్థితులు పునరావృతం అవుతాయన్న ఆందోళన నేపథ్యంలో.. బతుకమ్మ చీరల స్థానంలో స్వశక్తి సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


మరమగ్గాల కార్మికులకు చేతి నిండా పని...

స్వశక్తి మహిళలకు ఏడాదికి రెండు చీరలు ఇచ్చే విధంగా, సిరిసిల్లలో మరమగ్గాలు ఎక్కువగా ఉండడంతో అక్కడి వస్త్ర పరిశ్రమకే ప్రభుత్వం ఎక్కువ ఆర్డర్లు ఇచ్చింది. దీంతో సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం అందిస్తున్న వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు ఉపాధి భరోసానిస్తున్నాయి. గతంలో జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిన అనేక మంది కార్మికులు ఇప్పుడు గ్రామాల్లోనే చేతి వృత్తిలో నిమగ్నమయ్యారు. దీంతో మరమగ్గాల చప్పుళ్లు మొదలయ్యి, నేతన్నలకు చేతినిండా పని దొరికింది. జిల్లాలో జియో ట్యాగింగ్‌ చేసిన మరమగ్గాలు 27 వేల వరకు ఉన్నాయి. ఇందులో 131 మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(మ్యాక్స్‌)ల ద్వారా 9,600 మరమగ్గాలపైన 1.3 కోట్ల చీరల ఉత్పత్తి కొనసాగుతోంది. మొదట్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండడంతో చీరల ఉత్పత్తి వేగంగా జరగలేదు. క్రమంగా లక్ష్యం దిశగా.. వేగాన్ని పెంచడంతో చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. మొత్తం 4.30కోట్ల మీటర్ల మేర వస్త్రం అవసరమవుతుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 3.2 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తిని పూర్తిచేసి చివరి దశకు చేరుకున్నారు.

Updated Date - Nov 17 , 2025 | 06:09 AM