Share News

IndiGo Flight Delayed: ఇంట్లో కోపైౖలెట్‌.. విమానంలో ప్రయాణికులు

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:17 AM

విమానంలో ప్రయాణికులు.. ఇంట్లో కో పైలెట్‌..! వెరసి దాదాపు గంట విమానం ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోవాల్సి వచ్చింది...

IndiGo Flight Delayed: ఇంట్లో కోపైౖలెట్‌.. విమానంలో ప్రయాణికులు

  • కో పైలెట్‌ కోసం ఆగిన విమానం

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): విమానంలో ప్రయాణికులు.. ఇంట్లో కో పైలెట్‌..! వెరసి దాదాపు గంట విమానం ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన శనివారం శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 9.50 గంటలకు ముంబైకిఇండిగో 6ఈ 6263 విమానం బయలుదేరాల్సి ఉంది. 9.40 గంటలకల్లా ప్రయాణికులంతా విమానం ఎక్కారు. ప్రధాన పైలెట్‌ వచ్చారు కానీ కో పైలెట్‌ రాలేదు. ఎంతకీ విమానం కదలకపోయే సరికి సిబ్బందిని ప్రయాణికులు ఆరాతీశారు. కో పైలెట్‌ రాకపోవడంతో విమానం వెళ్లడం లేదని సమాధానం ఇవ్వడంతో కొద్దిసేపు సిబ్బందికి, ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. విమానం ఆలస్యంకావడంతో అజయ్‌కుమార్‌ అనే జనసేన నేత విమానంలో ప్రయాణికులు కూర్చున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌ అయింది. ఇలా కోపైలెట్‌ లేక విమానం ఆగడం మొదటిసారి అని తెలుస్తోంది. కోపైలెట్‌ రాకతో విమానం 10.50 గంటలకు ముంబై బయలుదేరి వెళ్లినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

జెద్దా నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇండిగో విమానం శనివారం బయలుదేరిన కొద్దిసేపటికే జీఎంఆర్‌ కస్టమర్‌ కేర్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. అప్రమత్తమైన భద్రత అధికారులు వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారమివ్వడంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్‌ కాగానే బాంబు, డాగ్‌ స్వ్కాడ్‌లతో తనిఖీలు నిర్వహించి ఎలాంటి బాంబు లేదని తేల్చడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ముంబై నుంచి విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 02 , 2025 | 04:17 AM