Share News

IndiGo Flight Cancellations: గ్లోబల్‌ సమ్మిట్‌పై ఇండిగో ప్రభావం?

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:42 AM

దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో అంతర్గత సమస్యలతో భారీగా విమాన సర్వీసులు రద్దు చేస్తుండడం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది...

IndiGo Flight Cancellations: గ్లోబల్‌ సమ్మిట్‌పై ఇండిగో ప్రభావం?

  • ప్రతినిధుల రాకపోకలకు ఇబ్బందులు

  • పరిస్థితిని సమీక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో అంతర్గత సమస్యలతో భారీగా విమాన సర్వీసులు రద్దు చేస్తుండడం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఫ్యూచర్‌ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు దేశ, విదేశాల నుంచి దాదాపు మూడు వేలమంది ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇదే సమయంలో దేశంలోని ప్రధాన విమానయాన సంస్థ ఇండిగో భారీగా విమాన సర్వీసులు రద్దు చేస్తుండడంతో ప్రభుత్వవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న ఆ సంస్థకు ఊరటనిస్తూ తాజాగా డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ‘ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్‌’ విషయంలో ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా పక్కనపెట్టింది. ఈ చర్య తమకు ఉపశమనంగా ఇండిగో ప్రకటించినా.. సమస్య పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. దేశ వ్యాప్తంగా శుక్రవారం వెయ్యి విమాన సర్వీసులను రద్దు చేసిన ఆ సంస్థ శనివారం ఆ సంఖ్య వెయ్యిలోపే ఉంటుందని తెలిపింది. ఈ నెల 10 నుంచి 15 మధ్యలో తమ సర్వీసులను సాధారణ స్థితికి తీసుకుచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ వెల్లడించారు. అయితే ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ ఈ నెల 8, 9 తేదీల్లో జరుగుతోంది. అప్పటికి ఇండిగో విమాన సర్వీసులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. శుక్రవారం ఒక్క రోజే హైదరాబాద్‌ నుంచి 156 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధులకు ప్రయాణ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షించేందుకు కొందరు ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఇక్కడకు వచ్చే ప్రతినిధులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అవసరమైతే ఇతర విమానయాన సంస్థలతో కూడా మాట్లాడి ప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించింది. ఇదిలా ఉంటే శుక్రవారం కొందరు అధికారులు ఇండిగో రీజినల్‌ మేనేజర్‌ను కలిసి పరిస్థితిని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Dec 06 , 2025 | 05:42 AM