Share News

Telangana Defence Excellence: స్వదేశీ సిమ్యులేటర్లు

ABN , Publish Date - Sep 26 , 2025 | 07:00 AM

ఇప్పటి వరకు డ్రోన్లు, క్షిపణులు, విమానాల విడిభాగాలు, ఇతర రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో దేశానికి అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్‌.. ఇప్పుడు యుద్ధ విమానాల శిక్షణకు అవసరమైన ఫ్లైట్‌ సిమ్యులేటర్‌ల...

Telangana Defence Excellence: స్వదేశీ సిమ్యులేటర్లు

  • రక్షణ రంగంలో మరో మైలురాయి!

  • టీ-వర్క్స్‌ వేదికగా ఉత్పత్తి.. ధర తక్కువ, నాణ్యత ఎక్కువ

  • ఫైటర్‌ జెట్‌ సిమ్యులేటర్‌ దిగుమతి చేసుకుంటే 50 కోట్లు

  • దేశీయంగా 25-30 కోట్లకే తయారీ.. నవశకానికి నాంది

  • ఇంజనీర్లకు ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు ప్రశంస

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు డ్రోన్లు, క్షిపణులు, విమానాల విడిభాగాలు, ఇతర రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో దేశానికి అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్‌.. ఇప్పుడు యుద్ధ విమానాల శిక్షణకు అవసరమైన ఫ్లైట్‌ సిమ్యులేటర్‌ల తయారీకి కూడా వేదిక కానుంది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని టీ-వర్క్స్‌ వేదికగా యుద్థ విమానాల ఫ్లైట్‌ సిమ్యులేటర్ల ఉత్పత్తి జరగనుంది. ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ యుద్థ విమానాల పైలట్ల శిక్షణ కోసం అవసరమయ్యే లెవెల్‌-డి ఫుల్‌ ఫ్లైట్‌ సిమ్యులేటర్లను ఇప్పటి దాకా అమెరికా, యూరప్‌ దేశాల నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. ఈ ఉత్పత్తులు హైదరాబాద్‌లోనే జరగనుండటంతో ఇక ఆ అవసరం ఉండదు. పైగా మనదేశమే అగ్రదేశాలకు ఎగుమతి చేయగలిగే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఎయిర్‌ ఫోర్సులో పైలట్లుగా ఎంపికైనఅభ్యర్థులకు మొదట ఫ్లైట్‌ సిమ్యులేటర్లలో శిక్షణనిస్తారు. విమానం ఎగిరేలా కృత్రిమ వాతావరణాన్ని సృష్టించే సిమ్యులేటర్లు నిజంగా ఎయిర్‌ క్రాఫ్ట్‌ను గాలిలో నడిపిన అనుభూతిని, అనుభవాన్ని ఇస్తాయి. కాక్‌ పిట్‌లో కూర్చుని బయటి నుంచి ట్రెయినర్లు ఇచ్చే సూచనల ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యవస్థను పైలట్లు నియంత్రించాల్సి ఉంటుంది. విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌, తలకిందులుగా ఎగరడం లాంటి అన్ని రకాల విన్యాసాల శిక్షణ ఈ సిమ్యులేటర్‌ ద్వారానే పైలట్లకు లభిస్తుంది.


ఇన్నోవేషన్స్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌తో దేశీ సంస్థ ఒప్పందాలు

యాక్సియల్‌ ఏరో ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఈ సిమ్యులేటర్ల తయారీకి అన్ని అనుమతులు సాధించి, ఉత్పత్తి కూడా మొదలు పెట్టి కొత్త శకానికి నాంది పలికింది. వచ్చే మూడేళ్లలో ఐదు సిమ్యులేటర్లను సరఫరా చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నెలకొల్పిన ఇన్నోవేషన్స్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం మన ఎయిర్‌ఫోర్స్‌ దిగుమతి చేసుకుంటున్న ఒక్కో ఫైటర్‌ జెట్‌ సిమ్యులేటర్‌ ఖరీదు రూ.50 కోట్ల దాకా ఉండగా, యాక్సియల్‌ ఏరో సంస్థ మాత్రం రూ.25-30 కోట్లకే అందజేయనుంది. టీ-వర్క్స్‌లో పరిశోధనలు సాగిస్తున్న ఈ సంస్థ ఎయిర్‌ఫోర్స్‌, నేవీ అవసరాలకు తగిన విధంగా ఫ్లైట్‌ సిమ్యులేటర్లను తయారు చేయడానికి సర్వం సిద్థం చేసుకుంది. ఇటీవల టీ-వర్క్స్‌ను సందర్శించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు దాదాపు రెండు గంటల ేసపు పరిశోధనల పురోగతిని పరిశీలించి, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. తక్కువ సమయంలో క్లిష్టమైన పరిశోధనలను పూర్తి చేసి ఈ ఆర్డర్లు సాధించినందుకు ఆ సంస్థ యాజమాన్యాన్ని, ఇంజనీర్లను, సిబ్బందిని మంత్రి ప్రశంసించారు. సాధ్యమైనంత త్వరలో అత్యాధునిక సిమ్యులేటర్లను రూపొందించి హైదరాబాద్‌ కీర్తిని జెట్‌ వేగంతో గగన తలానికి తీసుకెళ్లాలని సూచించారు.


దేశీ సిమ్యులేటర్ల ప్రత్యేకతలు

ఈ సిమ్యులేటర్ల మరో ప్రత్యేకత ఏమిటంటే దిగుమతి చేసుకునే వాటికంటే అత్యుత్తమ ప్రమాణాలు కలిగి ఉంటాయి. యాక్సియల్‌ ఏరో రూపొందిస్తున్న సిమ్యులేటర్లు 360 డిగ్రీల మేర తిరగ గలిగే స్టివార్టు ప్లాట్‌ ఫామ్‌ను కలిగి ఉంటాయి. దీని వల్ల యుద్ధ క్షేత్రంలో శత్రువుకు దొరకకుండా తప్పించుకునేందుకు ఫైటర్‌ జెట్లను నడిపించే పైలట్లు అనుసరించే విన్యాసాలన్నీ ఇందులో సాధ్యమవుతాయి. సిమ్యులేటర్ల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైతే, విడిభాగాలు అందించే అనుబంధ పరిశ్రమలు కూడా పుట్టుకొస్తాయి. భవిష్యత్తులో హైదరాబాద్‌ ఫ్లైట్‌ సిమ్యులేటర్లకు ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుంది.

Updated Date - Sep 26 , 2025 | 07:03 AM