Earth Sciences University : దేశానికే తలమానికంగా ఎర్త్ సైన్సెస్ వర్సిటీ
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:04 AM
కొన్ని నెలల క్రితం వరకు అది ఒక సాధారణ ఇంజనీరింగ్ కళాశాల.. కానీ ప్రస్తుతం మన్మోహన్‌సింగ్ ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీగా మారింది....
54 ప్రయోగశాలలు.. ఒక్కో ల్యాబ్‌కు రూ.30లక్షలు
హాస్టళ్లకు 14 బ్లాకులు.. అడ్మినిస్ట్రేషన్‌కు మరో ఆరు
రూ.వెయ్యి కోట్లతో అధికారుల ప్రతిపాదనలు
డిసెంబరులో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ముఖ్యమంత్రిని ఆహ్వానించిన తుమ్మల
కొత్తగూడెం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కొన్ని నెలల క్రితం వరకు అది ఒక సాధారణ ఇంజనీరింగ్ కళాశాల.. కానీ ప్రస్తుతం మన్మోహన్‌సింగ్ ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీగా మారింది. దేశంలోనే ఈ తరహా సాంకేతిక విద్యనందించే తొలి విద్యా సంస్థగా అవతరించిన ఈ కేంద్రాన్ని అత్యాధునిక సాంకేతిక, మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దేలా సర్కారు మాస్టర్ ప్లాన్ రూపొందించింది. మంత్రి తుమ్మల చొరవతో 300 ఎకరాల్లో దేశానికే తలమానికంగా ఉండేలా వర్సిటీని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి రూ.వెయ్యి కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వచ్చే మూడేళ్లలో నిర్మాణాలన్నీ పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాగా, డిసెంబరు మొదటివారంలో సీఎం చేతులమీదుగా ఈ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. దానికి సంబంధించి మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎంను కలిసి ఆహ్వానం పలికారు. సీఎం రాక ఖరారైన వెంటనే మంత్రి తుమ్మల విద్యాశాఖ కార్యదర్శి శ్రీధర్, కొత్తగూడెం జిల్లా అధికారులు, సంబంధిత శాఖలను అప్రమత్తం చేశారు. డిసెంబరు మొదటి వారంలో వర్సిటీని ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేయాలని ఆదేశించారు.
సీఎ్‌సఆర్ ఫండ్స్ ద్వారా నిధుల సమీకరణ
దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ వర్సిటీని కొత్తగూడెంలో ఏర్పాటు చేశారు. బీఎస్సీలో జియాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌తోపాటు ఎమ్మెస్సీలో జియాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియర్ సైన్స్, జియో ఇన్ఫర్మేషన్ సైన్సెస్ వంటి కోర్సులను అందిస్తున్నారు. ఈ యేడాది అడ్మిషన్లు ప్రారంభించగా.. బీఎస్సీ జియాలజీలో 60 సీట్లకుగాను 14 మంది, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో 37 మంది చేరారు. కాగా, యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లతో ప్రతిపాదనలు పంపించగా.. అందులో తరగతి గదులు, హాస్టల్ భవనాలు, గ్రంథాలయం, సమావేశ మందిరం ఆట స్థలాలు, రిసెర్చ్ సెంటర్ లాంటి నిర్మాణాలకు రూ.500 కోట్ల వరకు ఉండగా.. మరో రూ.500 కోట్లతో ప్రింటింగ్ మెషీన్లు, ఇంటర్నెట్, కంప్యూటర్లు, ఏసీల వంటి వాటితోపాటు.. ల్యాబ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అండర్ గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి 24, పోస్టు గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి 30 ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ ప్రయోగశాలకు రూ.30 లక్షల చొప్పున ఖర్చు చేయనున్నారు. కాగా, యూనివర్సిటీకి సంబంధించి సీఎ్‌సఆర్ ఫండ్స్ ద్వారా నిధులు సమకూరేలా మంత్రి తుమ్మల సమన్వయం చేస్తున్నారు.
హాస్టళ్లకు 14 బ్లాకులు.. 1300 గదులు..
యూనివర్సిటీలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉండేలా హాస్టళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి 1800 మంది, ఎర్త్‌సైన్స్ విద్యార్థులు 2,500 మందిని అంచనా వేసి భవనాల నిర్మాణాల ప్లాన్‌ను రూపొందించారు. మొత్తం 14 బ్లాకుల్లో 1,300 గదులు ఏర్పాటు చేసి.. ఒక్కో గదికి ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉండేలా హాస్టళ్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు. డిపార్ట్‌మెంట్లు, అడ్మినిస్ట్రేటివ్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లకు సంబంధించి మరో ఆరు బ్లాకుల్లో నిర్మాణాలు చేపట్టనున్నారు.