Share News

Indrajal Ranger Anti Drone Vehicle: శత్రు డ్రోన్లపై ఇంద్రజాల్‌ అస్త్రం

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:39 AM

శత్రుదేశాల డ్రోన్లను ముందే గుర్తించి, వెంటాడి, వేటాడే అత్యాధునిక ఆయుధం అందుబాటులోకి వచ్చింది. మన దేశంలోనే మొట్టమొదటి...

Indrajal Ranger Anti Drone Vehicle: శత్రు డ్రోన్లపై ఇంద్రజాల్‌ అస్త్రం

  • దేశంలో మొట్టమొదటి యాంటీ డ్రోన్‌ గస్తీ వాహనం.. కృత్రిమ మేధ సాయంతో డ్రోన్లపై నిఘా

  • శత్రు డ్రోన్‌గా తేలితే వెంటనే నిర్వీర్యం

  • అభివృద్ధి చేసిన ఇంద్రజాల్‌ సంస్థ

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): శత్రుదేశాల డ్రోన్లను ముందే గుర్తించి, వెంటాడి, వేటాడే అత్యాధునిక ఆయుధం అందుబాటులోకి వచ్చింది. మన దేశంలోనే మొట్టమొదటి ‘యాంటీ డ్రోన్‌ పాట్రోల్‌ వెహికిల్‌ (ఏడీపీవీ)’ను హైదరాబాద్‌కు చెందిన ఇంద్రజాల్‌ డిఫెన్స్‌ సంస్థ బుధవారం ఆవిష్కరించింది. ‘ఇంద్రజాల్‌ రేంజర్‌’గా పిలుస్తున్న ఈ వాహనంలోని వ్యవస్థలు కృత్రిమ మేధ ఆధారంగా స్వతంత్రంగా పనిచేస్తాయి. గస్తీ కాస్తున్న సమయంలోనే చుట్టూ పది కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లపై నిఘా పెడుతాయి. శత్రుదేశాల డ్రోన్లను గుర్తించి, హ్యాకింగ్‌, జామింగ్‌ ద్వారా నిర్వీర్యం చేస్తాయి. సంప్రదాయ యాంటీ డ్రోన్‌ వ్యవస్థల కంటే ఆధునికంగా దీనిని అభివృద్ధి చేసినట్టు ఇంద్రజాల్‌ డిఫెన్స్‌ సంస్థ వెల్లడించింది. టీ-హబ్‌లో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ దేవేంద్ర ప్రతాప్‌ పాండే చేతుల మీదుగా ‘ఇంద్రజాల్‌ రేంజర్‌’ను ఆవిష్కరించింది. ముంబైలో జరిగిన 26/11 మారణకాండను గుర్తు చేసుకుంటూ, దాడి జరిగాక స్పందించడం కంటే ముందే అడ్డుకోవడం మేలనే ఉద్దేశంతో నవంబరు 26న విడుదల చేసినట్టు తెలిపింది. కీలక మౌలిక సదుపాయాలను నాశనం చేయడం ద్వారా ఆధిపత్యం చూపడానికి డ్రోన్లను వినియోగించడం పెరిగిందని ఈ సందర్భంగా దేవేంద్ర ప్రతాప్‌ పాండే పేర్కొన్నారు. శత్రు దేశాలు పంపుతున్న డ్రోన్లను మన బలగాలు ప్రతి రోజూ నిర్వీర్యం చేస్తూనే ఉన్నాయని.. ఇంద్రజాల్‌ రేంజర్‌ లాంటి వాహనాల అభివృద్ధి మన రక్షణ రంగంలో కీలక ముందడుగుగా నిలుస్తుందన్నారు.

ప్రయాణిస్తూనే కూల్చేస్తుంది

ఇంద్రజాల్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడు కిరణ్‌ రాజు మాట్లాడుతూ.. ఇంద్రజాల్‌ రేంజర్‌ కృత్రిమ మేధ ఆధారిత కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థ అని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు మన సరిహద్దు భద్రతా దళం బీఎ్‌సఎఫ్‌ 255 పాకిస్థానీ డ్రోన్లను నిర్వీర్యం చేసిందని చెప్పారు. శత్రుదేశ డ్రోన్లను నిర్వీర్యం చేయడానికి వేగంగా స్పందించే వ్యవస్థ కావాల్సి ఉందని, ఆ అవసరాన్ని ఇంద్రజాల్‌ రేంజర్‌ తీరుస్తుందని పేర్కొన్నారు. సాధారణంగా యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు ఒకేచోట ఉంటాయని.. దానికి భిన్నంగా ఇది ప్రయాణిస్తూనే చుట్టూ 10 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించగలదన్నారు. 4 కిలోమీటర్ల దూరంలో ఉండగానే డ్రోన్లను నియంత్రణలోకి తీసుకుంటుందని, సాధ్యం కాకపోతే 2 కిలోమీటర్ల దూరంలో ఉండగానే వాటిని కూల్చివేస్తుందని వెల్లడించారు. ఇది ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండానే పనిచేస్తుందని, డేటాను పంపడమే తప్ప రిసీవ్‌ చేసుకోదని.. కాబట్టి సైబర్‌దాడుల బారినపడే అవకాశాలు ఉండవని తెలిపారు. శత్రువు గుర్తించి, దాడి చేసే లోగానే ఇది మరో చోటుకు వెళ్తుంది కాబట్టి.. నష్టం జరిగే అవకాశాలు తక్కువని పేర్కొన్నారు. దేశ అంతర్గతంగా కీలక మౌలిక సదుపాయాలు, రద్దీ నగరాల్లో కూడా ఇది రక్షణ కల్పిస్తుందని చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో డిజిటల్‌ జియో ఫెన్సింగ్‌ వేయడంతోపాటుగా.. అతిక్రమణలను రికార్డ్‌ చేయడం, ఆ డ్రోన్లను నియంత్రణలోకి తీసుకోవడం దీనితో సాధ్యమన్నారు. ఈ వాహన పనితీరు పరీక్షించిన సమయంలో 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని తెలిపారు.


యుద్ధానికే కాదు..అక్రమాల నియంత్రణకూ

యుద్ధ రంగంలో పదాతి దళాలు ముఖాముఖి పోరాడటం, యుద్ధ విమానాలు శత్రుదేశ స్థావరాలపై దాడులు చేయడం పాత పద్ధతి. ఎలకా్ట్రనిక్‌ వార్‌ ఫేర్‌ వ్యవస్ధలు అభివృద్ధి చెందిన తరువాత యుద్ధాల తీరే మారిపోయింది. రష్యా- ఉక్రెయిన్‌ మధ్య యుద్ధంలో డ్రోన్లే కీలకంగా మారడం చూస్తున్నదే. ఉక్రెయిన్‌ చిన్నపాటి డ్రోన్లతోనే రష్యాకు భారీస్థాయిలో నష్టం కలిగించింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌ కూడా భారీ స్థాయిలో డ్రోన్‌ దాడులకు ప్రయత్నించింది. దీనికి తోడు ఇటీవలి కాలంలో దేశ సరిహద్దు ప్రాంతాలలో మత్తుపదార్థాలు, ఆయుధాలు జార విడిచేందుకు ఉగ్రవాదులు, స్మగ్లర్లు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల వద్ద గస్తీతోపాటు అక్రమ రవాణాను అరికట్టడానికీ ‘ఇంద్రజాల్‌ రేంజర్‌’ ఉపయోగపడుతుంది.

Updated Date - Nov 27 , 2025 | 04:39 AM