Share News

Union Minister G. Kishan Reddy: వికసిత్‌ భారత్‌ సరే ముందు ఆరోగ్య భారత్‌గా ఎదగాలి

ABN , Publish Date - Oct 10 , 2025 | 03:55 AM

మన దేశం వికసిత్‌ భారత్‌కన్నా ముందూ ఆరోగ్య భారత్‌గా ఎదగాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు కేంద్రం నిరంతర కార్యాచరణ...

Union Minister G. Kishan Reddy: వికసిత్‌ భారత్‌ సరే ముందు ఆరోగ్య భారత్‌గా ఎదగాలి

  • మైనే క్యాన్సర్‌ కో జీత్‌ లియా పుస్తకావిష్కరణలో కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): మన దేశం వికసిత్‌ భారత్‌కన్నా ముందూ ఆరోగ్య భారత్‌గా ఎదగాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు కేంద్రం నిరంతర కార్యాచరణ చేపడుతోందన్నారు. ప్రముఖ అంకాలజిస్టు డాక్టర్‌ పాల్కొండ విజయ్‌ ఆనంద్‌రెడ్డి రచించిన ‘ఐ యామ్‌ ఎ క్యాన్సర్‌ సర్వైవర్‌’ హిందీ అనువాదం ‘మైనే క్యాన్సర్‌ కో జీత్‌ లియా’ పుస్తకాన్ని గురువారం కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో క్యాన్సర్‌ను జయించిన 108 మంది విజయ గాథలను, వారి అనుభవాలను పొందుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్‌ పట్ల ప్రజల్లో గల భయాందోళనలు, అపోహల తొలగింపునకు 30 ఏళ్లుగా వైద్యవృత్తిలో కొనసాగుతున్న డాక్టర్‌ పాల్కొండ విజయ్‌ ఆనంద్‌ రెడ్డి విశేష కృషి చేశారని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ పుస్తకం క్యాన్సర్‌ బాధితులు ఆత్మస్థైర్యంతో దాన్ని జయించడంతోపాటు సాధారణ జీవితం గడుపొచ్చనే మనో ధైర్యాన్నందిస్తుందన్నారు. ప్రపంచంలో 2022లో 2 కోట్ల క్యాన్సర్‌ కేసులు నమోదైతే 97 లక్షల మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. మన దేశంలో 14 లక్షలకు పైగా క్యాన్సర్‌ కేసులు నమోదయ్యాయన్న కిషన్‌ రెడ్డి.. ఏటేటా క్యాన్సర్‌ కేసులు పెరుగుతుండటంతో దానిపట్ల అవగాహన, చికిత్స, మెరుగైన సదుపాయాల కల్పన చాలా ముఖ్యమన్నారు. 2025-26లో దేశవ్యాప్తంగా 200 సెంటర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డాక్టర్‌ విజయ్‌ ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్‌ నిర్ధారణ తర్వాత వైద్యులు కౌన్సిలింగ్‌ ఇస్తున్నా బాధితుల్లో భయం పోవట్లేదన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 03:55 AM