Share News

Prahlad Joshi: ఆహార భద్రత పథకం ప్రపంచానికే ఆదర్శం

ABN , Publish Date - Nov 21 , 2025 | 04:56 AM

కేంద్రం అమలు చేస్తున్న ఆహార భద్రత పథకం ప్రపంచానికే ఆదర్శమని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. ప్రపంచ బ్యాంకు....

Prahlad Joshi: ఆహార భద్రత పథకం ప్రపంచానికే ఆదర్శం

  • సరైన రికార్డులు అందజేస్తే ‘సీఎంఆర్‌ డెలివరీ’ సొమ్ము 1400 కోట్లు ఇస్తాం

  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

  • నల్లగొండలో ఎఫ్‌సీఐ ఆఫీసు ప్రారంభం

  • అదనపు రైల్వే ర్యాక్‌లు ఇవ్వండి: ఉత్తమ్‌

  • బత్తాయి రైతులను ఆదుకోండి: కోమటిరెడ్డి

నల్లగొండ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్రం అమలు చేస్తున్న ఆహార భద్రత పథకం ప్రపంచానికే ఆదర్శమని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదిక వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయన్నారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్న సర్కారు తమదేనన్నారు. నల్లగొండలోని ఎఫ్‌సీఐ కాంప్లెక్స్‌లో నూతనంగా నిర్మించిన డివిజన్‌ కార్యాలయ భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని, పన్నెండేళ్ల తమ ప్రభుత్వ హయాంలో దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచామన్నారు. తెలంగాణ నుంచి కేంద్రం సేకరించే ధాన్యం పదేళ్లలో 600 శాతం పెరిగిందని చెప్పారు. ఆహార భద్రత పథకం కింద తెలంగాణకు ప్రతీ నెలా 1.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను కేంద్రం అందిస్తోందని తెలిపారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తిపై ప్రహ్లాద్‌ జోషి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సరైన రికార్డులు సమర్పిస్తే సీఎంఆర్‌ డెలివరీకి సంబంధించి పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.1400 కోట్లను మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి కొవిడ్‌ సమయంలో పెండింగ్‌ ఉన్న రూ.343 కోట్ల సబ్సిడీని కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్రం రాష్ట్రానికి అదనపు రైల్వే ర్యాక్‌లు కేటాయిస్తే బియ్యం తరలింపు సులభమవుతుందని ఉత్తమ్‌ తెలిపారు. 2024-25కు బాయిల్డ్‌ రైస్‌ లక్ష్యాన్ని పెంచాలని కోరారు. నల్లగొండలో లక్ష మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో అదనపు గోదాములు నిర్మించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరగా.. ప్రహ్లాద్‌ జోషి స్పందిస్తూ ప్రస్తుతం ఇక్కడ 62 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉన్నాయని, వాటిని లక్ష మెట్రిక్‌ టన్నులకు పెంచేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. అదనపు గోదాముల విషయంలో భూసేకరణ చేసి ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ (ఓడీవోపీ) పథకంలో నల్లగొండ జిల్లా నుంచి బత్తాయి పంటను చేర్చి రైతులను ఆదుకోవాలని కూడా కోమటిరెడ్డి కోరారు.

Updated Date - Nov 21 , 2025 | 04:56 AM