Share News

Defence Minister Rajnath Singh: దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తాం!

ABN , Publish Date - Oct 04 , 2025 | 03:42 AM

భారత్‌ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, కానీ.. దేశంపై దాడికి యత్నించిన వారిని ఉపేక్షించేదిలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు....

Defence Minister Rajnath Singh: దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తాం!

  • ఆపరేషన్‌ సింధూర్‌తో శత్రుదేశానికి గట్టి జవాబిచ్చాం.. రక్షణ రంగంలో తగ్గిన దిగుమతులు

  • దేశ ఆర్థికాభివృద్ధిలో జైనులది కీలక పాత్ర

  • జీటో సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): భారత్‌ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, కానీ.. దేశంపై దాడికి యత్నించిన వారిని ఉపేక్షించేదిలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌తో శత్రుదేశానికి గట్టి జవాబిచ్చామన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ సందర్భంగా పాక్‌ ఉగ్రమూక స్థావరాలపై దాడులు చేశామేతప్ప పౌరులను టార్గెట్‌ చేయలేదని తెలిపారు. రక్షణ రంగంలో విదేశాలపై ఆధారపడే అవసరాన్ని తగ్గించామని, గత పదేళ్లలో రక్షణ రంగాన్ని బలోపేతం చేశామని పేర్కొన్నారు. రక్షణ రంగంలో దిగుమతులు తగ్గించి, ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగామన్నారు. మన దేశం నుంచి 11ఏళ్ల క్రితం రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.600 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.24వేల కోట్లకు చేరాయని, 2029కల్లా ఇవి రూ.50 వేల కోట్లకు చేరుకుంటాయన్నారు. జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (జీటో) ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల జీటో కనెక్ట్‌ 2025 సదస్సుకు ముఖ్య అతిథిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా 97 లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రా్‌ప్టల తయారీ కాంట్రాక్టును హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌కు అప్పగించామని.. వీటి తయారీలో వాడే విడిభాగాల్లో 64శాతం దేశీయంగా తయారు చేస్తున్నారని తెలిపారు. తేజస్‌, ఆకాష్‌ మిసైల్స్‌, అర్జున్‌ ట్యాంక్‌ వంటి వాటిని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ రానున్నకాలంలో మూడో స్థానానికి చేరుతుందన్నారు. దానికోసం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేలా సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. గతంలో చోరీకి గురైన 20 జైన తీర్థంకుల విగ్రహాలను తిరిగి తెప్పించామని తెలిపారు. జైనులు దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తున్నారని.. దేశంలో 0.5శాతం ఉన్న జైనులు చెల్లించే పన్నుల శాతం 24వరకు ఉందన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. జీఎస్టీతగ్గింపులతో 350 ఉత్పత్తుల ధరలు తగ్గాయన్నారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో రానున్న కాలంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్‌ మారబోతుందన్నారు. వికసిత్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.


విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్‌ తెలంగాణ : మంత్రి శ్రీధర్‌బాబు

విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్‌ అడ్ర్‌సగా, ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా తెలంగాణ మారిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైన్‌ వ్యాపారవేత్తలు ముందుకురావాలని కోరారు. తెలంగాణ అవకాశాల గని అని, పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల ప్రాంతమన్నారు. ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేముందు తెలంగాణలో పరిస్థితులు పరిశీలించాలన్నారు. సదస్సులో ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌బాబా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, జీటో హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రతినిధులు రోహిత్‌ కొఠారి, చోప్రా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 03:42 AM