Income Tax Raids Conducted at Caps Gold: క్యాప్స్ గోల్డ్ ఆఫీసుల్లో ఐటీ సోదాలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:43 AM
పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలపై క్యాప్స్ గోల్డ్ కంపెనీ ఆఫీసులు, షోరూంలు, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం...
నాలుగు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో తనిఖీలు
పన్ను ఎగవేత సహా ఇతర అవకతవకలపై నజర్
హైదరాబాద్/బోయినపల్లి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలపై క్యాప్స్ గోల్డ్ కంపెనీ ఆఫీసులు, షోరూంలు, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ ఆఫీసులు, షోరూంలు, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లతోపాటు విశాఖ, విజయవాడ, ముంబై, బెంగళూరులోని క్యాప్స్ గోల్డ్ షోరూంల్లో (నాలుగు రాష్ట్రాల్లోని 15ప్రాంతాల్లో) తనిఖీలు జరిగాయి. వాస్తవానికి క్యాప్స్ గోల్డ్ కంపెనీని 1901లో ప్రారంభించారు. అప్పట్లో చందా అంజయ్య పరమేశ్వర్ జ్యువెలరీస్ పేరిట వ్యాపారం ప్రారంభించారు. అదే సంస్థను క్యాప్స్ గోల్డ్‌గా మార్చిన నిర్వాహకులు.. దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించారు. క్యాప్స్ గోల్డ్ సంస్థ నిర్వహిస్తున్న కొన్ని స్కీముల్లో వచ్చిన డబ్బులతోపాటు దిగుమతి చేసుకున్న బంగారం, ఎగుమతి చేస్తున్న ఆభరణాలు, ఎంఎంటీసీ నుంచి కొనుగోలు చేస్తున్న బంగారానికి సంబంధించిన వ్యవహారంలో పన్ను ఎగవేతలు ఉన్నట్లు ఐటీకి ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే క్యాప్స్ గోల్డ్ కంపెనీ చైర్మన్ చందా నర్సింహరావు, డైరెక్టర్లు చందా శ్రీనివాస్, చందా వెంకటేశ్, చందా శ్రీనివాసరావు ఇళ్లల్లో తనిఖీలు జరిగాయి. బోయినపల్లిలోని లగ్జరీ గ్రీన్ విల్లాలో ఉన్న మూడు విల్లాలు, ఆయా ఇళ్ల ముందు ఉన్న ఖరీదైన కార్లలోనూ అధికారులు సోదాలు చేశారు. క్యాప్స్ గోల్డ్ కంపెనీ... బ్లాక్ మార్కెట్ నుంచి అక్రమంగా బంగారాన్ని కొనుగోలు చేస్తోందని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే, కాప్ గోల్డ్ నుంచి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు తీసుకుంటున్న కొన్ని రిటైల్ ఆభరణాల షాపుల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని పవన్ జ్యువెల్లర్స్‌లో స్టాక్‌తోపాటు రికార్డులను పరిశీలించారు. వాస్తవానికి బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా గత ఏడాది చెన్నైలో పవన్ జ్యువెల్లర్స్ యజమాని పవన్‌కుమార్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. కాగా, కాప్స్ గోల్డ్‌కు బ్లాక్ మార్కెట్‌లో బంగారం అందజేస్తున్న లింకులను సైతం ఐటీ అధికారులు పరిశీలిస్తుండటడంతో బంగారం వ్యాపారుల్లో కలవరం నెలకొంది.