Hyderabad Ganesh Immersion: నిమజ్జనం.. ప్రభంజనం
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:04 AM
అశేష భక్తకోటి పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. నామస్మరణ, భజనలు, కోలాటాలు, నృత్యాల మధ్య ‘వెళ్లిరా.. గణేశా’ అంటూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
గంగమ్మ ఒడికి గణనాథుడు
కన్నుల పండువగా శోభాయాత్ర
జన సంద్రంగా మారిన హుస్సేన్‌సాగర్ తీరం
మధ్యాహ్నానికే ‘మహాగణపతి’ నిమజ్జనం
ప్రత్యేక బస్సులు.. అదనపు ఎంఎంటీఎస్‌లు
బాలాపూర్ పాట అదుర్స్.. లడ్డూ రూ.35లక్షలు
విదేశాల్లోనూ గణేశ్ లడ్డూలకు మహా గిరాకీ
కెనడాలో రూ.15.1 లక్షలు పలికిన లడ్డూ
ఆస్ట్రేలియాలో రూ.2.25 లక్షలకు వేలం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అశేష భక్తకోటి పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. నామస్మరణ, భజనలు, కోలాటాలు, నృత్యాల మధ్య ‘వెళ్లిరా.. గణేశా’ అంటూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఎక్కడికక్కడ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. స్థానిక చెరువులు, వాగుల్లో వినాయక నిమజ్జనాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్, ఇతర చెరువులతోపాటు 74 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం కొనసాగింది. హుస్సేన్‌సాగర్ తీరం జన సంద్రంగా మారింది. శోభాయాత్ర మార్గాల్లో భక్తుల కోసం తాగునీరు, పులిహోర, పొంగల్, పూరీలు, గుగ్గిళ్లు వంటి ప్రసాదాలు అందజేశారు. ఖైరతాబాద్ మహా గణపతిని శనివారం తెల్లవారుజామున 5.15కు వాహనం పైకి చేర్చారు. 7.41 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవగా మధ్యాహ్నం 1.45 గంటలకు నిమజ్జనం పూర్తయింది. ముందుగానే ఆ ప్రాంతంలో పూడిక తీయడంతో 70 అడుగుల భారీ విగ్రహం ఈసారి పూర్తిగా నీట మునిగింది. కాగా, ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని సుమారు 40 లక్షల మంది దర్శించుకున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం సాయంత్రం వరకు 2.54 లక్షల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. కనీసం 1.5 అడుగుల కన్నా పెద్ద విగ్రహాలను లెక్కించామని తెలిపింది. మూడు అడుగులలోపు విగ్రహాలు 92 వేలకుపైగా ఉండగా, అంతకాన్న పెద్దవి 1.62 లక్షలకుపైగా ఉన్నాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్, పరిసర ప్రాంతాలకు వచ్చే భక్తుల కోసం 600 బస్సులు, రైల్వేశాఖ అదనపు ఎంఎంటీఎస్ సర్వీసులు నడిపాయి. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రోరైల్ సర్వీసులను కొనసాగించారు. శోభాయాత్రల మార్గంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించేందుకు సుమారు 15 వేల మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తించారు. సుమారు 30వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాన్ని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి ఆయన పరిశీలించారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామని, డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక హెలికాప్టర్‌లో గణేశ శోభాయాత్రలను, నిమజ్జనాన్ని పరిశీలించారు.
శంభు కుమారా.. లంబో ‘ధరా’
శనివారం నిమజ్జనానికి ముందు చాలా చోట్ల వినాయక మంటపాల్లో లడ్డూ ప్రసాదం వేలం పోటాపోటీగా సాగింది. ప్రఖ్యాత బాలాపూర్ గణేశుడి లడ్డూ ప్రసాదాన్ని (21 కిలోలు) కర్మాన్‌ఘాట్ బీజేపీ నేత లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. మరోవైపు గణేశుడి లడ్డూ వేలం సంప్రదాయం విదేశాలకూ చేరింది. కెనడాలోని స్కార్‌బరో తెలుగు అసోసియేషన్ గణేశుడి 10 కేజీల లడ్డూను కొందరు స్నేహితులు కలసి రూ.15.1 లక్షల (18,116 కెనడా డాలర్లు) రూపాయలకు కొంతమంది స్నేహితులు కలసి దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో తెలుగు సంఘం ప్రతినిధులు ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూను సినీ పంపిణీదారు మోహన్ కమ్మ రూ.2.55 లక్షలు (4,694 ఆస్ట్రేలియన్ డాలర్ల)కు సొంతం చేసుకున్నారు. బ్యాంకాక్‌లో థాయ్‌లాండ్ తెలుగు సంఘం ప్రతినిధుల వినాయకుడి లడ్డూను సంఘం సభ్యుడు రుద్రారం రవి రూ.48 వేలకు (21,000 థాయ్‌భాత్) పొందారు.
బుజ్జి పాపకు బొజ్జ గణపయ్య లడ్డూ
సికింద్రాబాద్‌లో వైఎంసీఏ భక్తసమాజం వినాయకుడి వద్ద 111 కేజీల లడ్డూ ప్రసాదం లక్కీడ్రాలో శాన్వి అనే మూడేళ్ల చిన్నారికి దక్కింది. మంటపంలో గణనాథుడి దర్శనానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు.. రూ.200 చెల్లించి శాన్వి పేరుతో టోకెన్ తీసుకున్నారు. శనివారం ఆ చిన్నారితోనే లక్కీడ్రా తీయించగా.. ఆమె పేరే రావడంతో ప్రసాదం అందజేశారు.