Share News

kumaram bheem asifabad- రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

ABN , Publish Date - Oct 26 , 2025 | 10:21 PM

మహారాష్ట్ర సరిహద్దు మండలమైన సిర్పూర్‌(టి)లో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది. పేదలకు ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని కొందరు మహారాష్ట్ర మార్కెట్‌లకు తరలిస్తున్నారు. సెప్టెంబరు నుంచి అక్టోబరు మధ్యకాలంలో వరుస దాడులు జరిపిన అధికారులు మొత్తం 150 క్వింటాళ్లకు పైగా బియ్యంను స్వాధీనం చేసుకున్నారు.

kumaram bheem asifabad- రేషన్‌ బియ్యం అక్రమ రవాణా
రైల్వేస్టేషన్‌లో అధికారులు పట్టుకున్న రేషన్‌ బియ్యం

సిర్పూర్‌(టి), అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర సరిహద్దు మండలమైన సిర్పూర్‌(టి)లో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది. పేదలకు ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని కొందరు మహారాష్ట్ర మార్కెట్‌లకు తరలిస్తున్నారు. సెప్టెంబరు నుంచి అక్టోబరు మధ్యకాలంలో వరుస దాడులు జరిపిన అధికారులు మొత్తం 150 క్వింటాళ్లకు పైగా బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. చెక్‌ పోస్టులు, రైల్వే స్టేషన్‌, రైస్‌ మిల్లులు, రేషన్‌ దుకాణాల వరకు ఈ దందా విస్తరించిందని విచారణలో తేలింది. సిర్పూర(టి) సరిహద్దు గ్రామం కావడంతో అక్రమ రవాణా దారులు ప్రధానంగా వెంకట్రావుపేట్‌ మీదుగా పోడ్సా, రైలు మార్గం మీదుగా వీరూర్‌, రాజురా ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై కైడా దందా కొనసాగిస్తున్నారు. కొందరు డీలర్లు స్థానిక రేషన్‌ షాపుల నుంచే బియ్యంను కొనుగోలు చేసి మాఫియాలకు అందజేస్తున్నారు. తహసీల్దార్‌ రహీముద్దీన్‌ మా ట్లాడుతూ రేషన్‌ బియ్యం విక్రయించినట్లయితే మూడు సార్లు పట్టుబడితే లబ్ధిదారుల రేషన్‌ కార్డులను రద్దు చేస్తామన్నారు. పేదలకు కడుపునింపుకోవడానికి పంపిణీ చేస్తున్న బియ్యంను సద్వినియోగం చేసుకోవాలని దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవల ఇలా..

- సిర్పూర్‌(టి) రైల్వే స్టేషన్‌ వద్ద సెప్టెంబరు 5న తనిఖీల్లో 25 క్వింటాళ్ల బియ్యం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

- మండలంలోని మద్దెల వాగు సమీపంలోని రైస్‌ మిల్లులో సెప్టెంబరు 12న సుమారు 100 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి.

- పారిగాం రేషన్‌ డీలర్‌ వ్యవహారంలో అక్టోబరు 10న 12.92 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం.

- రైల్వే స్టేషన్‌ వద్ద అక్టోబరు 14న 3.05 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

- వెంకట్రావుపేట చెక్‌పోస్టు వద్ద అక్టోబరు 17న 5.03 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం

ప్రత్యేక బృందాల ఏర్పాటు..

- ఎస్సై సురేష్‌, సిర్పూర్‌(టి)

రైల్వే స్టేషన్‌లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించేందకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే పలువురిపై 6(ఏ) కేసు నమోదు చేశాం. పారిగాం ఘటన, మద్దెలవాగు ఘటనలతో అధిక మొత్తం బియ్యం దందా వెలుగులోకి రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూ, పోలీసు శాఖలు పూర్తి స్థాయిలో సరిహద్దు ప్రాంఆల్లో ప్రత్యేక నిఘా పెడుతున్నాం. అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుం టాం. పట్టుబడితే పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తాం.

Updated Date - Oct 26 , 2025 | 10:21 PM