Illegal Private Travel Buses Run Freely: కళ్ల ముందు అక్రమాలు కానరావా?
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:04 AM
ఆర్టీసీ బస్సులతో పోటాపోటీగా, ఒకలా చెప్పాలంటే తోసిరాజనేలా పెద్ద సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి...
అనుమతి లేకున్నా, భద్రతా ప్రమాణాలు పాటించకున్నారోడ్లపై యథేచ్ఛగా ట్రావెల్స్ బస్సుల చక్కర్లు
పట్టించుకోని రవాణా శాఖ అధికారులు
కేసుల నమోదులోనూ చేతివాటం..
హైదరాబాద్ సిటీ/ గన్‌పార్క్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులతో పోటాపోటీగా, ఒకలా చెప్పాలంటే తోసిరాజనేలా పెద్ద సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి. రవాణాశాఖ లెక్కల ప్రకారమే.. హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు సుమారు 1,100 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. రవాణా శాఖ అధికారులు ఆ బస్సులు నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా అన్నది తనిఖీ చేయాలి. రిజిస్ట్రేషన్, ఆలిండియా పర్మిట్, ఫిట్‌నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్లతోపాటు ప్రయాణికుల భద్ర తకు సంబంధించి అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు, ప్రథమ చికిత్స కిట్లు, అత్యవసర పరిస్థితుల్లో అద్దాలు బద్దలుగొట్టేందుకు వీలుగా సీట్ల సుత్తెలు వంటివి ఉన్నాయో లేదో చూడాలి. రవాణా శాఖ అధికారులు మామూళ్ల మత్తులో చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రవాణా శాఖలో ఒక్కో ఫైల్‌కు ఒక్కో రేటు ఉంటుందని, ఇది అందరికీ తెలిసిందేనని ఏజెంట్లు చెబుతున్నారు. ట్రావెల్స్ బస్సులకు సంబంధించి రవాణా శాఖకు అధికారికంగా చెల్లించే ఫీజులతోపాటు రూ.5వేల నుంచి రూ.10 వేలవరకు మామూళ్లు తప్పవని అంటున్నారు. మరోవైపు టార్గెట్లు పూర్తి చేయడం, పనిచేస్తున్నామని చూపించుకోవడం కోసం అధికారులు నామమాత్రంగా బస్సులను తనిఖీలు చేస్తుంటారని, ఆ సమయంలోనూ చేతివాటం చూపించి మొక్కుబడి కేసులు, జరిమానాలతో సరిపుచ్చుతారనే ఆరోపణలెన్నో ఉన్నాయి.
ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి
ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు, టార్గెట్‌లు పూర్తి చేయాలకున్నప్పుడు మాత్రం రవాణా శాఖ అధికారుల హడావుడి కనిపిస్తుంటుంది. ఇప్పుడు కర్నూలులో ఘోర ప్రమాదం జరిగిన రోజు నుంచే హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా హైవేలపై తనిఖీ చేపట్టారు. ఒకే రోజులోనే నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న 68 ప్రైవేట్ బస్సులను గుర్తించారు. రూ.1.70 లక్షల జరిమానాలు విధించారు. గతంలోని జరిమానాలు చెల్లించకుండా తిరుగుతున్న 4 బస్సులను సీజ్ చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇన్ని రోజులుగా అవి తిరుగుతున్నా కనిపించలేదా అనే విమర్శలు వస్తున్నాయి.
రోడ్లపైనే బస్సులు నిలుపుతున్నా..
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతాలైన అమీర్‌పేట, లక్డీకాపూల్, సెక్రటేరియట్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపక్కనే గంటలకు గంటలు పార్క్ చేసి ఉంటాయి.లక్డీకాపూల్ అయితే రవాణశాఖ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఉంటుంది. అక్కడి రైల్వే ఖాళీ స్థలంలో 50కిపైగా ట్రావెల్స్ బస్సులు పార్క్ చేస్తారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు పక్కన బస్సులు నిలపడం వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు వస్తున్నా పట్టించుకునేవారే లేరనే విమర్శలు ఉన్నాయి.