Illegal Permissions and Occupancy Certificates: విలీనానికి ముందు..విచ్చలవిడి అనుమతులు
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:41 AM
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆకుపచ్చ రంగు పరదా చాటున దాగి ఉన్న భవనం.. ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. స్లాబులు కూడా పూర్తి కాలేదు....
విలీన మునిసిపాలిటీల్లో పర్మిషన్ల దందా!
నిర్మాణ దశలో ఉన్న భవనానికి ఓసీ జారీ
కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు,పార్కులో నిర్మించిన భవనానికీ పర్మిషన్లు
ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్ల కేటాయింపు
ఆస్తిపన్నులో అడ్డగోలు మినహాయింపులు
జీహెచ్‌ఎంసీలో మునిసిపాలిటీల విలీనంతో మునిసిపల్ అధికార్ల అక్రమాలు
ఏసీబీ, విజిలెన్స్‌కు చేరిన వసూళ్ల చిట్టా
పూర్తి స్థాయి విచారణకు రంగం సిద్ధం
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్ర జ్యోతి): ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆకుపచ్చ రంగు పరదా చాటున దాగి ఉన్న భవనం.. ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. స్లాబులు కూడా పూర్తి కాలేదు. కానీ, ఈ భవనానికి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అప్పుడే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేశారు. ఇందుకు కారణం.. ఈ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనం అవుతుండడమే. విలీన ప్రక్రియ పూర్తికాక ముందే సర్టిఫికెట్ ఇచ్చి.. దొరికినంత దండుకోవడమే దీని వెనుక ఉద్దేశం.
ఈ తరహా వ్యవహారాలు ఈ ఒక్క కార్పొరేషన్‌లోనే కాదు.. జీహెచ్‌ఎంసీలో విలీనమైన ఏడు కార్పొరేషన్లు, 20 మునిసిపాలిటీల్లో చాలా చోట్ల జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మునిసిపాలిటీల విలీనం నేపథ్యంలో కొందరు మునిసిపల్ అధికారులు అక్రమాలకు తెరతీశారు. అసంపూర్తి భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫిట్లు ఇవ్వడం ఒక్కటే కాకుండా.. కోర్టు వివాదాల్లో ఉన్న భూముల్లో నిర్మాణాలకు పచ్చజెండా ఊపడం, ఆస్తి పన్ను పెండింగ్ కేసుల క్లియరెన్స్ పేరుతో అడ్డగోలు వసూళ్లకు పాల్పడటం , పార్కుల్లో నిర్మాణాలు చేశారనే ఫిర్యాదులున్న భవనాలను క్రమబద్ధీకరణ చేయడం వంటి అనేక అవకతవకలకు పాల్పడ్డారు. విలీనానికి వారం రోజుల వ్యవధిలోనే పెద్ద ఎత్తున అక్రమ అనుమతులు జారీ చేసి.. రూ.కోట్లు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై కొందరు ఏసీబీకి, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణకు రంగం సిదమైంది.
‘బండ్ల’లో అక్రమ సొమ్ము తరలింపు..
గతంలో వికారాబాద్‌లో పనిచేసి ప్రస్తుతం ఓ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారి.. కోట్ల రూపాయల అక్రమార్జనను ‘బండ్ల’లో తరలించినట్లు ఆరోపణలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆ కార్పొరేషన్ విలీనానికి కొద్దిరోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు, నిమిషాల వ్యవధిలోనే 19 ఓసీలు జారీ చేసి రూ.కోటిన్నర దండుకున్నట్లు తెలిసింది. ఆదివారం సెలవురోజు అయినా..పాత తేదీలతో అనుమతులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చివరి మూడు రోజుల్లో పెద్ద సంఖ్యలో భవననిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు, ఒక్కో అనుమతికి రూ.4.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మొత్తం మూడు రోజుల వ్యవధిలో రూ.7 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. సదరు కార్పొరేషన్.. జీహెచ్‌ఎంసీలో విలీనం అవుతుందన్న విషయం తెలిసినప్పటి నుంచే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతులు, ఓసీలు పెద్ద ఎత్తున జారీ అయ్యాయి. కేవలం పిల్లర్లు వేసిన నివాస సముదాయాలకు సైతం ఓసీలు జారీ చేసి పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు సమాచారం. స్లాబ్ వేయడం వరకే పూర్తయిన నిర్మాణాలు, ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా, కనీస సెట్ బ్యాక్‌లు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు సైతం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఓసీలు జారీ చేశారనే ఆరోపణలున్నాయి.
కోర్టు వివాదాలున్నా బేఖాతరు..
జీహెచ్‌ఎంసీలో విలీనమైన కొన్ని మునిసిపాలిటీల్లో.. కోర్టు వివాదాలున్న భూముల్లోనూ నిర్మాణాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పురపాలక శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఓ కార్పొరేషన్ పరిధిలో హైకోర్టులో కేసు నడుస్తున్న స్థలంలో మునిసిపల్ కమిషనర్ స్వయంగా కేసు విచారణకు హాజరైనా.. అక్కడ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమైంది. మరో కార్పొరేషన్ పరిధిలోని ఓ కాలనీలో ప్రభుత్వ లెక్కల్లో పార్కులుగా చూపించిన స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినా.. అలాంటి వాటికీ అనుమతులు, ఓసీలు జారీ చేసి పెద్ద మొత్తంలో వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. నాలాలు, కుంటలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలకు సైతం ఓసీలు జారీ చేసినట్లు తెలిసింది. ఓ కార్పొరేషన్ పరిధిలో జరిగిన బడా నిర్మాణాల్లో కొన్ని పత్రాలను ఫోర్జరీ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేసి క్విడ్ ప్రోకో పద్ధతిలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపినట్లు సమాచారం.
సెట్‌బ్యాక్‌లు లేకున్నా సెట్ చేసేశారు!
కొన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సెట్ బ్యాక్‌లు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపకుండానే సెట్ చేసేశారనే ఆరోపణలున్నాయి. ఓ మునిసిపల్ కమిషనర్ తన పరిధిలో నిర్మించిన స్టిల్ట్, ఏడు అంతస్తుల భవనానికి సెట్ బ్యాక్‌లు లేకున్నా, ఓసీ జారీ చేసి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. సదరు కమిషనర్ ఇటీవల తన సొంత ఊరిలో జరిగిన జాతరకు కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు, మేయర్లు, ఇతర నాయకులను పిలిచి పార్టీ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. అక్రమ అనుమతులకుగాను బినామీల పేర్లతో ఫ్లాట్ తీసుకున్న విషయం కూడా బహిర్గతమైంది. ఇతర మునిసిపాలిటీల్లో కూడా వసూళ్ల దందా నడిచిందనే ఆరోపణలున్నాయి. విలీనమైన మునిసిపాలిటీల్లో తాజాగా ఇచ్చిన అనుమతులపై ఇప్పటికే ఏసీబీ, విజిలెన్స్ దృష్టి సారించింది. వీటిలో బండ్లగూడ, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట, బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లు, 20 మునిసిపాలిటీల్లో దుండిగల్, కొంపల్లి, శంషాబాద్, బొల్లారం, జల్‌పల్లి, మణికొండ వంటి కీలక ప్రాంతాలు ఉన్నాయి. విలీనానికి ప్రతిపాదించిన పలు మునిసిపాలిటీల్లో ఇచ్చిన అనుమతులు, జారీ చేసిన ఓసీలతోపాటు గతంలో జరిగిన లావాదేవీల్లో అక్రమాలకు సంబంధించి ఆధారాలతో కొందరు ఏసీబీ, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఆయా విభాగాలు అంతర్గత విచారణ జరుపుతున్నాయి.