Kaleshwaram Project: పునరుద్ధరణ డిజైన్లు మేం ఇస్తాం
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:20 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్లతోపాటు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను అందించడానికి మద్రాస్...
కాళేశ్వరం బ్యారేజీలపై ముందుకొచ్చిన ఐఐటీలు
నిస్సాన్, ఆర్వీ అసోసియేట్స్, స్పెయిన్ సంస్థ కూడా
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్లతోపాటు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను అందించడానికి మద్రాస్, రూర్కీ, హైదరాబాద్ ఐఐటీలు ముందుకొచ్చాయి. వాటితోపాటు నిప్పాన్, ఆర్వీ అసోసియేట్స్, స్పెయిన్‌కు చెందిన సంస్థ కూడా ఇందుకు ఆసక్తి కనబరిచింది. ప్రధానంగా 14 మీటర్ల ఎత్తు బ్యారేజీల నిర్మాణానికి సహకారం అందించిన సంస్థలు కావాలని ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)ను ఆహ్వానిస్తూ నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని సవరించాలని, 7.5 మీటర్లకు కుదించాలని కోరుతూ ఆయా సంస్థలు నివేదించాయి. కాగా, సోమవారం నీటిపారుదల శాఖ కార్యాలయంలో టెక్నికల్ ప్రీ బిడ్ సమావేశం జరిగింది. మూడు ఐఐటీలు, స్పెయిన్ సంస్థ, నిప్పాన్, ఆర్వీ అసోసియేట్ ఆసక్తి చూపడంతోపాటు మరో వారం గడువు పెంచాలని కోరడంతో వీరి విజ్ఞప్తిని అధికారులు మన్నించే అవకాశాలున్నాయి. బ్యారేజీల పునరుద్ధరణకు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల నివేదికను వీరికి అందించనున్నారు. బ్యారేజీ పటిష్టతపై మదింపు, హైడ్రాలజీ, హైడ్రాలిక్ రివ్యూ, వరదలు/భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కోవడంలో బ్యారేజీల సామర్థ్యంపై మదింపు, గేట్లు/పియర్లు/సిల్టింగ్ బేసిన్/కటాఫ్ వాల్స్ వంటి బ్యారేజీలోని కీలక విభాగాలను పటిష్ఠం చేసేందుకు డిజైన్లు అందించడం వంటి సేవలను అందించాలని ప్రభుత్వం కోరింది. బ్యారేజీల ప్రస్తుత డిజైన్లతోపాటు ఎన్‌డీఎ్‌సఏ నివేదికల్లోని సిఫారసులను పునఃసమీక్షించాలని పేర్కొంది. ఈ క్రమంలో అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి జియో టెక్నికల్, జియో ఫిజికల్ వంటి పరీక్షలు పరిశీలించాలని సూచించింది. ఈ పరీక్షల ద్వారా బ్యారేజీలలో అన్ని రకాల లోపాలను గుర్తించాలని కోరింది. ఎన్‌డీఎ్‌సఏ సిఫారసుల మేరకు మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకును పటిష్ఠం చేయడం లేదా సురక్షితంగా తొలగించే అంశంపై అధ్యయనం జరిపి తగిన పరిష్కారాలను సూచించాలని తెలిపింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఇతర బ్లాక్‌లకు ఎలాంటి నష్టం జరగకుండా 7వ బ్లాక్‌ను తొలగించేలా ఈ పరిష్కారాలు ఉండాలని షరతు విధించింది. ఇక 15 ఏళ్ల కాలంలో తేలియాడే పునాదుల (పర్‌మియబుల్ ఫౌండేషన్)తో కూడిన బ్యారేజీల డిజైన్లతోపాటు పునరుద్ధరణ పను ల్లో, అందులోనూ సీకెంట్ పైల్స్ కటా్‌ఫల పనుల్లో అనుభవం ఉండాలని గుర్తుచేసింది. ఇక ఎంపికైన సంస్థ అందించే డిజైన్లు, డ్రాయింగ్స్‌ను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం కోసం పంపించనున్నారు. అయితే కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో ఐఐటీ-రూర్కీ సాంకేతిక సహాయం అందించినందున.. ఈసారి ఆ సంస్థ తప్ప మిగతా సంస్థల సహకారం ప్రభుత్వం తీసుకునే అవకాశాలున్నాయి.