Share News

GHMC Park Illegally Registered: జీహెచ్‌ఎంసీ పార్కునే అమ్మకానికి పెట్టిన సబ్‌ రిజిస్ట్రార్‌

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:33 AM

సబ్‌ రిజిస్ట్రార్ల అక్రమాలు, కాసుల కక్కుర్తి రిజిస్ట్రేషన్‌ శాఖలో కలకలం రేపుతున్నాయి. ఇటీవలి వరు స పరిణామాలు, ఏసీబీ దాడులు, మంత్రి తీవ్రం గా ఆగ్రహం వ్యక్తం చేయడంతో....

GHMC Park Illegally Registered: జీహెచ్‌ఎంసీ పార్కునే అమ్మకానికి పెట్టిన సబ్‌ రిజిస్ట్రార్‌

  • డీఆర్‌లు, డీఐజీలతో ఐజీ సమావేశం

  • పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్ర జ్యోతి): సబ్‌ రిజిస్ట్రార్ల అక్రమాలు, కాసుల కక్కుర్తి రిజిస్ట్రేషన్‌ శాఖలో కలకలం రేపుతున్నాయి. ఇటీవలి వరు స పరిణామాలు, ఏసీబీ దాడులు, మంత్రి తీవ్రం గా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ శాఖ ఉన్నతాధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనితో రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ మంగళవారం డిప్యూటీ రిజిస్ట్రార్లు (డీఆర్‌), డీఐజీలతో సమావేశమై పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వరుస ఘటనలతో కలకలం

వనస్థలిపురం సబ్‌ రిజిస్ట్రార్‌ ఏసీబీకి పట్టుబడటంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్‌ అసిస్టెంట్‌ శివశంకర్‌.. మూడు రోజుల్లోనే రోజూ తన కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కును ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేసేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు మంగళవారం ఆయనపై వేటు వేశారు. ఇక సరూర్‌నగర్‌లో శ్రీలత అనే సబ్‌ రిజిస్ట్రార్‌ రెండు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు రూ.15 లక్షలు లంచం డి మాండ్‌ చేయడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. లంచం తీసుకున్నది నిజమేనని సబ్‌ రిజిస్ట్రార్‌ కోర్టులో అంగీకరించడంతో ఆమెను సస్పెండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని కీలక ప్రాంతంలో జిల్లా రిజిస్ట్రార్‌గా ఉన్న ఓ అధికారి.. పదేళ్లుగా వివాదంలో ఉన్న ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాలని ఓ సబ్‌ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి చేశారు. వినకపోవడంతో మరో సబ్‌ రిజిస్ట్రార్‌ ద్వారా ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించారు. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కుత్బుల్లాపూర్‌లో ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసిన ఓ సబ్‌ రిజిస్ట్రార్‌పై ఐజీ గతంలో వేటు వేశారు. అయితే ఐజీకి, అదనపు ఐజీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అక్కడి డీఆర్‌, ఆపై స్థాయి అధికారులు కలిసి ఆ సబ్‌ రిజిస్ట్రార్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. ఇది తెలిసి ఐజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


శాఖను భ్రష్టుపట్టిస్తున్నారు

ఇటీవల ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అవినీతికి సంబంధించి వరుసగా దాడులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వైరా, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్‌, జహీరాబాద్‌, మేడ్చల్‌, శేరిలింగంపల్లి, గండిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. అంతకుముందు మిర్యాలగూడ, వనపర్తి, జడ్చర్ల, సదాశివపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో దాడులు చేశారు. దీనిపై సంబంధిత శాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బాగా పని చేస్తారని ఒక జోన్‌ నుంచి మరో జోన్‌కు మార్చి బాధ్యతలు అప్పగించిన సబ్‌ రిజిస్ట్రార్లు, నగరంలోనూ, రాష్ట్రంలో కీలక జిల్లాలకు జిల్లా రిజిస్ట్రార్లుగా నియమించిన వారుకూడా శాఖ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా శాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని మండిపినట్టు తెలిసింది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ మంగళవారం జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలతో సమావేశమయ్యారు. రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీలు లేకపోవడం, అవినీతికి కొందరు డీఆర్‌లు, డీఐజీలు సహకరించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని.. దీనికి సిగ్గుపడాలని ఈ సందర్భంగా అన్నట్టు తెలిసింది. ప్రభుత్వ స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేయకూడదనే కనీస బాధ్యత కూడా ఎలా విస్మరిస్తున్నారని నిలదీసినట్టు సమాచారం. పనితీరు మార్చుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలిసింది.

Updated Date - Nov 19 , 2025 | 04:33 AM