Share News

కన్నీళ్లే..

ABN , Publish Date - Apr 30 , 2025 | 01:04 AM

వారంతా రెక్కాడితేగాని.. డొక్కాడని కుటుంబాలకు చెందినవారు. పొద్దస్తమానం కష్టపడితే తప్ప కుటుంబాలను పోషించుకోలేని దీనస్థితి. ఉదయం ఆరు గంటలకు విధుల్లో చేరిన వారు ఇంకో పావుగంటలో ఇంటికి వెళ్తారనుకునే సమయానికి ఒక్కసారిగా విధి వక్రించింది.

కన్నీళ్లే..
కంపెనీ ఎదుట అందోళన చేస్తున్న గ్రామస్థులు

ఇంటి పెద్దలను కోల్పోయిన కుటుంబాలు

ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌లో భారీ ప్రమాదం

ఘటనలో ఒకరు మృతి.. ఇద్దరు గల్లంతు.. ఆరుగురికి తీవ్రగాయాలు

మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఘటన

మోటకొండూరు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): వారంతా రెక్కాడితేగాని.. డొక్కాడని కుటుంబాలకు చెందినవారు. పొద్దస్తమానం కష్టపడితే తప్ప కుటుంబాలను పోషించుకోలేని దీనస్థితి. ఉదయం ఆరు గంటలకు విధుల్లో చేరిన వారు ఇంకో పావుగంటలో ఇంటికి వెళ్తారనుకునే సమయానికి ఒక్కసారిగా విధి వక్రించింది. అప్పటిదాకా అంతా కలిసి పనిచేసిన బ్లాక్‌లో భారీ పేలుడు సంభవించి కొందరి శరీరాలు చెల్లాచెదురు కాగా, మరికొందరు శకలాల కింద చిక్కుకున్నారు. ఇంకొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రులకు తరలించారు. మంగళవారం ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌లో జరిగింది. ఈ పేలుడు ధాటికి రెండు కిలోమీటర్ల వరకు భూమి కంపిచనట్లయిందని స్థానికులు పేర్కొన్నారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కంపెనీలోని సెక్షన్‌ 18ఏ భవనంలో శ్రీహరికోట రాకెట్‌ లాంచ్‌ వెహికిల్‌లో వినియోగించే ప్రొఫలెంట్‌ మిక్సింగ్‌ చేస్తున్న సమయంలో మంగళవారం సాయంత్రం భారీ పేలు డు సంభవించింది. ఈ ఘటనలో భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. అదే సమయంలో అక్కడ ఏడుగురు కూలీలు విధులు నిర్వర్తిస్తున్నారు. పేలుడు ధాటికి పక్కన ఉన్న భవనాలు పగుల్లు పడడంతోపాటు శకలాలకింద మాంసపు ముద్దలు పడిఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో మండల కేంద్రానికి చెందిన చందోజు దేవిచరణ్‌(22), కాటేపల్లికి చెందిన గునుకుంట్ల సందీప్‌(30) ఉన్నారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన కాల్వల నరేష్‌(33) తీవ్రంగా గాయపడగా, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు క్షతగత్రులు వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన బుగ్గ లింగస్వామి, చాడ గ్రామానికి చెందిన రాజబోయిన శ్రీకాంత్‌, యాదగిరిగుట్ట మండలం కాచారంనకు చెందిన బర్ల శ్రీకాంత్‌, పెద్దకందుకూరు గ్రామానికి చెందిన సంద మహేందర్‌, మోటకొండూరు మండలం బెజ్జెంకిబావికి చెందిన సలేంద్ర మహేష్‌, భువనగిరి మండలం అనాజిపూరం గ్రామానికి చెందిన ఎన్‌.మహే్‌షకు తీవ్రగాయాలు కాగా భువనగిరిలోని ప్రైవేట్‌ అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా ఆక్కడ చికిత్స పొందుతున్నారు.

కన్నీరే మిగిలింది..

కాటేపల్లి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తితోపాటు గాయపడిన, శకలాల కింద చిక్కుకున్న వారిపైనే ఆయా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రమాదంలో మృతి చెందిన నరేష్‌కు ఏడాది క్రితం వివాహం కాగా, అతని భార్య గర్భిణి. సీమంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, అనుకోకుండా జరిగిన ప్రమాదంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. అదే విధంగా కాటేపల్లికి చెందిన సందీప్‌ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఇతనిపైనే ఉంది. మోటకొండూరుకు చెందిన దేవి చరణ్‌ చిన్నతనంలోనే తండ్రి వదిలేయడంతో తల్లి పెంచింది. అయితే శకలాల కింద చిక్కుకున్న వారు ఇంకా బతికే ఉంటారన్న ఆశతో ఆ కుటుంబ సభ్యులు ఘటనాస్థలంలో ఎదురు చూస్తున్నారు. క్షణక్షణం ఉత్కంఠతో రోదిస్తూ కన్పించారు. అదే విధంగా రోజూ ఇంటికొచ్చే వారు, కంపెనీలో పనిచేసుకొని అటునుంచి అటే ఆస్పత్రుల పాలు కావడంతో క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు రోదిస్తూ పెరుగెత్తడంతో ఆయా గ్రామాల్లో విషాధచాయలు అలముకున్నాయి.

భారీ శబ్ధానికి ఉలిక్కిపడిన ప్రజలు

మోటకొండూరు మండలంలోని కాటేపల్లిలో జరిగిన భారీ పేలుడుతో సెక్షన్‌ 18ఏ భవనం పూర్తిగా కుప్పకులిపోగా, దట్టమైన పొగతో కూడిన భారీ శబ్ధానికి దాదాపు ఆరు కిలోమీటర్ల మేర శబ్ధం రావడంతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు భయందోళనకు గురయ్యారు. దీంతో ఏం జరిగిందో అర్థంకాక ప్రజలు రోడ్లపైకి వచ్చారు.

గ్రామస్థుల ఆందోళన

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజీవ్స్‌ కంపెనీలో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌చేస్తూ కంపెనీ ఎదుట, రాయిగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ఘటనా స్థలానికి చేరుకోగా అందోళనకారులు ఆయనను చుట్టుముట్టారు. దీంతో ఏసీపీ రమే్‌షకుమార్‌, సీఐ కొండల్‌రావు, ఎస్‌ఐ ఉమే్‌షయదవ్‌ అందోళనకారులకు నచ్చజెప్పడంతో అందోళన విరమించారు.

గాయపడిన కార్మికులు హైదరాబాద్‌కు తరలింపు

భువనగిరి టౌన్‌: మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజీవ్స్‌ పేలుళ్లలో గాయపడిన కార్మికులను హైదరా బాద్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. పేలుడు జరిగిన వెంటనే భువనగిరిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి నలుగు రు కార్మికులను జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ నలుగురని, ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందించి, మరో ముగ్గురు కార్మి కులను వేర్వేరు అంబులెన్స్‌లలో హైదరాబాద్‌లోని వేర్వేరు ఆసుప త్రులకు పంపారు. తరలించిన కార్మికుల్లో రాజబోయిన శ్రీకాంత్‌ (చాడ), బుగ్గ లింగస్వామి (పులిగిల్ల), నరేష్‌ (ఆత్మకూరు(ఎం)), మహేందర్‌ (కందుకూరు), బర్ల శ్రీకాంత్‌ (కాచారం), నల్ల మహేష్‌ (అనాజిపురం)తోపాటు మరో కార్మికుడు ఉన్నారు. అయితే బాధితులను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన బంధుమిత్రుల రోధనలతో ఆసుప్రతుల్లో విషాధచాయలు అలముకున్నాయి. ఆస్పత్రుల వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.

వరుస పేలుళ్లతో ప్రజల్లో ఆందోళన

యాదగిరిగుట్ట రూరల్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజీవ్స్‌ కంపెనీలలో వరుస పేల్లుళతో కార్మికులు బెంబేలెత్తుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద కందుకూర్‌ గ్రామంలో 2025 జనవరి 4వ తేదీన జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, నలుగురు గాయపడిన ఘటన జరిగి నాలుగు నెలలు గడువక ముందే అదే కంపెనీకి సంబంధించి, తాజాగా కాటేపల్లి ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజీవ్స్‌ కంపెనీలో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనకు కారణం యాజమాన్యం నిర్లక్ష్య మే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కంపెనీల్లో పనిచేసే కార్మికులకు ప్రొడక్షన్‌పై సరైన అవగాహన లేకపోవడం, కార్మికులకు వాటిపై శిక్షణ ఇవ్వకపోవడంతో ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్‌ కంపె నీ 1985లో స్థాపించారు. కంపెనీలో అప్పటి నుంచి నేటి వర కు వరుసగా 2011లో పేలుడు జరిగినప్పుడు ఇద్దరు, 2019లో ఒకరు, 2025 లో మరో కార్మికుడు ఇప్పటివరకు నలుగురు మృత్యువాత పడ్డారు. వరుస పేలుళ్లతో కార్మికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా కంపెనీ యాజమాన్యంపై ఆయా శాఖలకు చెందిన అధి కారులు చర్యలు తీసుకున్న ఘటనలు లేకపోలేదు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 30 , 2025 | 01:04 AM