మా స్కీంలో చేరితే కారు గెలుస్తారు
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:17 AM
‘మా లక్కీ డ్రా స్కీంలో చేరితే ఆకర్షణీయమైన బహుమతులు వస్తాయి.. అదృష్టం వరిస్తే కారు కూడా గెలుస్తారు’ అని అమాయకులను నమ్మించిన నిర్వాహకులు వారిని నట్టేట ముంచారు.
లక్కీడ్రా స్కీం పేరిట రూ.4కోట్లకు శఠగోపం
ఆరు నెలలుగా నిలిచిన చెల్లింపులు
బోర్డు తిప్పేసిన ఆర్‌కే ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులు
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
మిర్యాలగూడలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
మిర్యాలగూడ అర్బన్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ‘మా లక్కీ డ్రా స్కీంలో చేరితే ఆకర్షణీయమైన బహుమతులు వస్తాయి.. అదృష్టం వరిస్తే కారు కూడా గెలుస్తారు’ అని అమాయకులను నమ్మించిన నిర్వాహకులు వారిని నట్టేట ముంచారు. రోజుకుకొంత పోగేసిన కూలీలు, సామాన్యులు సభ్యులుగా చేరారు. మోసపోయామని తెలిసి లబోదిబోమన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్‌కే ఎంటర్ ప్రైజెస్ పేరిట మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన కె. రమేష్, బచ్చలకూరి శ్రీనివాస్, కె. కోటేశ్వరరావు లక్కీడ్రా స్కీం ప్రారంభించారు. తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాలతోపాటు ఏపీ సరిహద్దు గ్రామాల్లోనూ ఏజెంట్లను నియమించుకుని ఒక్కో సభ్యుడి నుంచి నెలకు రూ.1000 చొప్పున వసూలు చేశారు. స్కీంలో చేరిన సభ్యులు 15 నెలలపాటు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. స్కీంలో మొత్తం 2600 మంది సభ్యులను చేర్చుకుని ప్రతినెలా డ్రా తీసి 10మందికి రూ.15వేల విలువైన వస్తువులు ఇచ్చారు. గతేడాది అక్టోబరు నెలలో ప్రారంభమైన లక్కీడ్రా స్కీం ఈ ఏడాది జనవరిలో ముగిసింది. ఇప్పటివరకు 150మందికి డ్రా పద్ధతిలో చెల్లించిన నిర్వాహకులు తర్వాత చేతులెత్తేశారు. ఆరు నెలలుగా నిర్వాహకులు పత్తాలేకుండా పోవడంతో వారి ఆచూకీ కోసం సభ్యులు ఆరాతీశారు. తమను సభ్యులుగా చేర్పించిన ఏజెంట్లను నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో తాము మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు.
చైన్ పద్ధతిలో వసూలు
చైన్ పద్ధతిలో నడిచే ఈ స్కీంలో 2,600మంది సభ్యులు చేరారు. వారి నుంచి ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున 15నెలల పాటు స్కీంను నడిపించి సుమారు రూ. 4 కోట్ల వరకు వసూలు చేశారు. చివరి నెలలో బంపర్‌డ్రాలో కారు ఇస్తామని నమ్మించారని బాధితులు వాపోయారు. స్కీంలో పేర్కొన్న నిబంధనల మేరకు చెల్లింపులు జరపకపోవడం, బంపర్ డ్రా తీయకపోవడంతో అనుమానించి మిర్యాలగూడ పట్టణంలోని కలాల్‌వాడకు చెందిన మెరుగు వెంకటమ్మ అనే బాధితురాలు తనను సభ్యురాలుగా చేర్పించిన ఏజెంట్లు మందారి మల్లేశ్వరి, నిర్వాహకుడు రమేష్‌పై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న మిగతా బాధితులు కూడా పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ పట్టణంలోనే సుమారు 900మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. మిగతా బాధితులు సూర్యాపేట, ఏపీ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా సరిహద్దు గ్రామాల్లోనూ ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి స్కీం నిర్వాహకుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ మోతీరాం తెలిపారు.